ఫిబ్రవరి చివరికి నగదు విత్‌డ్రా కష్టాలకు చెక్
పరిమితి ఎత్తివేయొచ్చని బ్యాంకర్ల అంచనా
న్యూఢిల్లీ: బ్యాంకులు, ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా పరిమితిని ఫిబ్రవరి చివరికల్లా రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) తొలగించనున్నట్లు బ్యాంకర్లు వెల్లడించారు. నగదు విత్‌డ్రా పరిమితిని ఫిబ్రవరి చివరికి లేక మార్చి మొదటి అర్ధ భాగంలో పూర్తిగా తొలగించనున్నట్లు గురువారం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే గుప్తా మీడియాకు తెలిపారు. అన్ని కోణాల్లో ఆలోచించి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం ఫిబ్రవరి చివరికల్లా 78–88% కొత్త కరెన్సీ వ్యవస్థలోకి వచ్చేస్తుంది. మరో 2 నెలల్లో నగదు విషయంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయి.
అయితే ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మాత్రం బ్యాంకింగ్ వ్యవస్థ నిర్ధేశిత సమయంలో సాధారణ పరిస్థితులకు రావడంపై స్థాయీ సంఘానికి స్పష్టంగా చెప్పలేదు. అయితే రద్దయిన పెద్ద నోట్ల స్థానంలో రూ. 9.2 లక్షల కోట్లు లేక 60% కొత్త నోట్లను ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఆర్బీఐ ఇటీవలే ఏటీఎంల్లో విత్‌డ్రా పరిమితిని రోజుకు రూ. 10,000 పెంచి, వారంలో పరిమితిని మాత్రం సేవింగ్స్ అకౌంట్లకు రూ. 24,000, కరెంట్ అకౌంట్లకు రూ. లక్ష కొనసాగించడం తెలిసిందే.
ఆ కొత్త నోట్ల వివరాలు చెప్పలేం...
పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన నవంబర్ 8కి ముందే ముద్రించి సిద్ధంచేసిన కొత్త నోట్ల వివరాలు చెప్పడం కుదరదని ఆర్‌బీఐ స్పష్టంచేసింది. ముందే ఎన్ని కొత్త రూ.2,000, రూ.500 నోట్లు ముద్రించారని సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు.. బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ వివరణ ఇచ్చింది.