న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా భారత్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ఆవిష్కరించింది. వచ్చే 5–7 సంవత్సరాల్లో సుమారు రూ. 75 వేల కోట్లు (దాదాపు 10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇందుకోసం గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ ఏర్పాటును ప్రకటించారు. ’గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
భారత్‌పైనా, భారత డిజిటల్ ఎకానమీ భవిష్యత్‌పైనా తమ కంపెనీకి ఉన్న నమ్మకాన్ని తాజా పెట్టుబడులు ప్రతిబింబిస్తాయని పిచాయ్ తెలిపారు.‘గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ ఆవిష్కరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. దీని ద్వారా వచ్చే 5–7 ఏళ్లలో భారత్‌లో రూ. 75,000 కోట్లు (సుమారు 10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తాం. ఈక్విటీ, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పన తదితర మార్గాల్లో ఈ పెట్టుబడులు ఉంటాయి‘ అని పిచాయ్ తెలిపారు.
నాలుగు ప్రధానాంశాలపై దృష్టి...
భారత్ డిజిటలీకరణకు తోడ్పడేలా ప్రధానంగా నాలుగు విభాగాల్లో ఈ ఇన్వెస్ట్‌మెంట్లు ఉంటాయని సుందర్ తెలిపారు. ప్రతి భారతీయుడికి తమ తమ ప్రాంతీయ భాషల్లో సమాచారం అందుబాటులో ఉండేలా చూసే ప్రాజెక్టు కూడా ఇందులో ఒకటని వివరించారు. అలాగే, ప్రత్యేకంగా భారత్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు, సర్వీసుల రూపకల్పనపైనా ఇన్వెస్ట్ చేయనున్నట్లు సుందర్ పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు డిజిటల్‌కు మళ్లేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తామన్నారు. చివరిగా సామాజిక శ్రేయస్సుకు తోడ్పడేలా వైద్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాలు మరింత మెరుగుపడేలా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని మరింత వినియోగంలోకి తేవడంపై దృష్టి పెడతామని సుందర్ తెలిపారు.
భారత్ ప్రత్యేకం...
ప్రస్తుతం భారతీయులు టెక్నాలజీ తమ దాకా వచ్చేంత వరకూ నిరీక్షించాల్సిన అవసరం ఉండటం లేదని.. కొత్త తరం టెక్నాలజీలు ముందుగా భారత్‌లోనే ఆవిష్కృతమవుతున్నాయని సుందర్ తెలిపారు. ‘భారత్‌తో పాటు యావత్ ప్రపంచం ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటోందని అనడంలో సందేహం లేదు. మన ఆరోగ్యాలు, మన ఆర్థిక వ్యవస్థలకు ఎదురైన పెను సవాళ్లు.. మన పనితీరును, జీవన విధానాలను పునఃసమీక్షించుకునేలా చేశాయి.
అయితే, ఇలాంటి సవాళ్లే కొంగొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయి‘ అని ఆయన పేర్కొన్నారు. కొత్త తరం ఆవిష్కరణలతో ప్రయోజనం పొందడం మాత్రమే కాదు.. వాటి రూపకల్పనలోనూ భారత్ ముందుండేలా చూడటం తమ లక్ష్యమని సుందర్ చెప్పారు. ముందుగా భారత్ కోసం ఉత్పత్తులు తయారు చేయడమన్నది.. మిగతా ప్రపంచ దేశాలకు మరింత మెరుగైన ఉత్పత్తులను అందించే దిశలో గూగుల్‌కు ఎంతగానో ఉపయోగపడిందని గూగుల్ చీఫ్ పేర్కొన్నారు.
ప్రధాని మోదీతో పిచాయ్ భేటీ...
డేటా భద్రత, ఆన్‌లైన్ విద్య తదితర అంశాలపై చర్చ
ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోమవారం వర్చువల్‌గా సమావేశమయ్యారు. డేటా భద్రత, గోప్యతపై సందేహాలు, రైతాంగానికి సాంకేతికతను మరింతగా చేరువ చేయడం, ఆన్‌లైన్ విద్య విధానాన్ని విస్తరించడం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. ‘డేటా భద్రతపై సందేహాలను పారద్రోలేందుకు టెక్ కంపెనీలు మరింతగా కృషి చేయాలని ప్రధాని సూచించారు.
అలాగే, సైబర్ దాడుల ద్వారా జరిగే సైబర్ నేరాలు, ముప్పుల గురించి ప్రస్తావించారు. రైతులకు టెక్నాలజీ ప్రయోజనాలు అందించడం, వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలు వంటి అంశాలపై చర్చించారు. విద్యార్థులతో పాటు రైతులకు కూడా ఉపయోగపడేలా వర్చువల్ ల్యాబ్స్ ఏర్పాటు ఆలోచన గురించి ప్రస్తావించారు‘ అని పీఎంవో తెలిపింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, కొత్త ఉద్యోగాల కల్పన కోసం తీసుకుంటున్న చర్యలు మొదలైన అంశాలను ప్రధాని వివరించారు.
కరోనా వైరస్ సంబంధ సమాచారం, తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలను అందించడంలోనూ .. అపోహలు, తప్పుడు వార్తలకు అడ్డుకట్ట వేయడంలోనూ గూగుల్ క్రియాశీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ‘సుందర్‌పిచాయ్‌తో భేటీలో రైతులు, యువత, ఔత్సాహిక వ్యాపారవేత్తల జీవితాలను మార్చగలగడంలో టెక్నాలజీ వినియోగం గురించి చర్చించాం‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘సమావేశానికి సమయం కేటాయించినందుకు మీకు కృతజ్ఞతలు. డిజిటల్ ఇండియాకి సంబంధించి మీ విజన్‌ను సాకారం చేసే దిశగా మేము కూడా కృషి చేయడం కొనసాగిస్తాం‘ అని ప్రతిగా సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.
మరిన్ని భాగస్వామ్యాలు..
భారత మార్కెట్లో ప్రణాళికల్లో భాగంగా ప్రసార భారతితో కూడా జట్టు కడుతున్నట్లు గూగుల్ తెలిపింది. డిజిటల్ సాధనాలతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలను మల్చుకునేలా చిన్న సంస్థల్లో అవగాహన పెంచేందుకు దూరదర్శన్‌లో ఎడ్యుటెయిన్‌మెంట్ సిరీస్‌ను ప్రారంభించింది. అలాగే, 2020 ఆఖరు నాటికి భారత్‌లో 22,000 పైచిలుకు పాఠశాల్లో 10 లక్షల మంది పైగా ఉపాధ్యాయులకు శిక్షణ అందించేందుకు సీబీఎస్‌ఈతో జట్టుకట్టామని గూగుల్ వెల్లడించింది. ఇక గ్లోబల్ డిస్టెన్స్ లెర్నింగ్ ఫండ్ ద్వారా అల్పాదాయ వర్గాల కోసం కైవల్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌కు గూగుల్‌డాట్‌ఆర్గ్ ద్వారా మిలియన్ డాలర్లు గ్రాంట్ అందిస్తున్నట్లు పేర్కొంది.
చిన్న సంస్థల డిజిటలీకరణ..
చిన్న వ్యాపార సంస్థలు డిజిటల్ బాట పట్టడంలో గూగుల్ గణనీయంగా తోడ్పాటు అందిస్తోందని సుందర్ చెప్పారు. ప్రస్తుతం 2.6 కోట్లకు పైగా ఎస్‌ఎంబీలను (చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలు) సెర్చి, మ్యాప్స్‌లో చూడవచ్చని, వీటికి ప్రతి నెలా 15 కోట్ల మంది పైగా యూజర్లు ఉంటున్నారని ఆయన వివరించారు. కరోనా వల్ల డిజిటల్ సాధనాల వినియోగం మరింత పెరిగిందన్నారు. ‘మా బామ్మకు కూరగాయల వాళ్లతో బేరాలడటం కుదరకపోవడం అనే ఒక్క లోటు తప్ప..లాక్‌డౌన్ వేళ వివిధ ఉత్పత్తులు, సర్వీసులను పొందేందుకు డిజిటల్ చెల్లింపుల విధానం బాగా ఉపయోగపడింది’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment