పన్ను రేటు తగ్గించరూ..!
జీఎస్‌టీ కౌన్సిల్‌కు వినతుల వెల్లువ
► 133 ఉత్పత్తులపై అభ్యర్థనలు
న్యూఢిల్లీ: ఉత్పత్తులపై పన్నులు తగ్గించాలని కోరుతూ జీఎస్టీ కౌన్సిల్ ముందుకు భారీగా దరఖాస్తులు వచ్చి చేరుతున్నాయి. హెల్మెట్ల నుంచి హైబ్రిడ్ కార్ల వరకు మొత్తం 133 ఉత్పత్తులకు సంబంధించి వినతులు ఇందులో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. జీఎస్టీలో భాగంగా 5, 12, 18, 28 శాతం చొప్పున నాలుగు రకాల పన్ను శ్లాబుల్లో అన్ని వస్తువులు, సేవలను సర్దుబాటు చేశారు.
అంతకుముందుతో పోలిస్తే కొన్నింటిపై రేట్లు తగ్గగా, కొన్నింటిపై పెరిగిపోయాయి. దీంతో నూతన పన్ను రేట్లపై కొన్ని రంగాలు సంతృప్తికరంగా లేవని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐటీ రంగం భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుండటంతో ఈ రంగానికి చెందిన ఉత్పత్తులు, సేవలపై పన్నును ప్రస్తుతమున్న 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించాలన్నది ఇందులో ఒకటి. అలాగే, ఐటీ హార్డ్‌వేర్‌పై 28 శాతం పన్నును 18 శాతానికి తగ్గించాలన్న డిమాండ్ కూడా ఉంది.
ఇక జీఎస్టీలో హెల్మెట్లపై పన్నును 18 శాతం వేశారు. దాన్ని 5 శాతానికి తగ్గించాలని ఈ రంగం కోరుతోంది. అలాగే, టెక్స్‌టైల్స్‌పై 5 శాతం పన్ను రేటును పూర్తిగా ఎత్తేయాలని ఈ రంగం డిమాండ్ చేస్తోంది. ట్రాక్టర్లపై పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి, గ్రానైట్ శ్లాబులపై 28 శాతం నుంచి 18 శాతానికి, నమ్కీన్, భూజియాస్, ఆలుగడ్డ చిప్స్‌పై 12 నుంచి 5 శాతానికి, కుల్ఫీ, వేరుశనగ చక్కీలపైనా పన్ను రేటును సవరించాలన్న డిమాండ్లు జీఎస్టీ కౌన్సిల్ ముందుకు వచ్చాయి. ఇక సేమ్యాపై 5 శాతం పన్ను ఉండగా, అదే తరహా ఉత్పత్తులైన మాక్రోనీ/పాస్తా/నూడుల్స్‌పై 18 శాతం పన్ను అమలవుతోంది. దీంతో వీటిపైనా పన్నును 5 శాతానికి తగ్గించాలన్న వినతులు వచ్చాయి.
తాగేనీరు, మోటారుసైకిళ్లపైనా...
20 లీటర్ల మంచి నీటి క్యాన్లు, పౌచుల్లో విక్రయించే తాగే నీరుపై 18% పన్ను విధిస్తున్నారు. వీటితోపాటు హెయిర్‌పిన్, ఎల్పీజీ స్టవ్‌లు, గొడుగులు, రాసే పరికరాలు, వెట్ గ్రైండర్లు, బరువు తూచే యంత్రాలు, నమిలే పొగాకు ఉత్పత్తులు, ప్రింటర్లు, చేతి తయారీ కార్పెట్లు, టెక్స్‌టైల్ యంత్రాలపైనా పన్ను తగ్గించాలని అభ్యర్థనలు వచ్చాయి. 350సీసీ సామర్థ్యానికి మించిన మోటారు సైకిళ్లపై 28% పన్ను రేటుకు అదనంగా 3% సెస్సు అమలవుతోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఉత్పత్తులన్నీ ఈ సామర్థ్యం ఉన్నవే. దేశీయ తయారీని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఈ సెస్సును తీసేయాలన్న డిమాండ్ కూడా ఉంది. హైబ్రిడ్ కార్లపై 15% సెస్సును 3 శాతానికి తగ్గించాలని, పర్యావరణానికి అనుకూలమైనవి కనుక వీటిని ప్రోత్సహించాలన్న సూచనలు కూడా ఉన్నాయి. ఇంకా పన్ను తగ్గించాలంటూ వచ్చిన దరఖాస్తుల్లో ఎండుచేపలు, ప్లాస్టి క్ తుక్కు, చేపల వలలు, ఫర్నిచర్, ముడి గ్రానైట్, ఫినిష్డ్ గ్రానైట్, ఫ్లైయాష్ బ్రిక్స్ కూడా ఉన్నాయి. ఈ వినతుల్లో కొన్నింటిని ఫిట్‌మెంట్ కమిటీకి ప్రతిపాదించడం జరిగిందని, కమిటీ సూచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి.