భారీగా పెరిగిన ఫోర్డ్ ఎండీవర్ ధర
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ సెస్ రేట్ల పెంపు తర్వాత కార్ల కంపెనీలు ధరలను పెంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆటోమేకర్ ఫోర్డ్ ఇండియా తన ప్రీమియం ఎస్‌యూవీ ఎండీవర్ ధరలను భారీగా పెంచేసింది. జెస్టీ సెస్ రేట్లకు అనుగుణంగా ప్రీమియం ఎస్‌యూవీ ఎండీవర్ ధరలను రూ.1.8 లక్షలకు వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఫిగో హ్యాచ్‌బ్యాక్ నుంచి ఐకానిన్ మస్టాంగ్ సెడాన్ వరకు వివిధ మోడళ్లను ఈ కంపెనీ విక్రయిస్తోంది. వేరియంట్‌ను బట్టి ఎండీవర్ కారు ధర రూ.1.2 లక్షల నుంచి రూ.1.8 లక్షల వరకు పెంచుతున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. కంపెనీకి చెందిన ఇతర మోడల్స్‌పై ఈ పెంపు ప్రభావం అంతగా లేదని పేర్కొన్నారు.
జీఎస్టీ సెస్ పెంపుతో ఇప్పటికే హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్, హోండా కార్స్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్‌లు తమ వాహనాల ధరలను పెంచేశాయి. గూడ్స్ అండ్ సర్వీసు ట్యాక్స్(జీఎస్టీ) కింద మిడ్ సైజు, పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై సెస్ రేట్లు 2 శాతం, 5 శాతం, 7 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. జీఎస్టీ పాలన కింద కార్లపై అత్యధిక పన్ను శ్లాబు 28 శాతంగా ఉంది. సెస్ 1 శాతం నుంచి 22 శాతంగా ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు ఫోర్డ్ ఎండీవర్ ధర రూ.1.5 లక్షల మేర తగ్గించనున్నట్టు కంపెనీ తెలిపింది. కానీ సెస్ రేట్లు పెంచడంతో, ఫోర్డ్ ఎండీవర్ ధరను మళ్లీ కంపెనీ పెంచేసింది.