హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జూమ్! | HDFC Bank Q4 net profit up 20.7% YoY; in line with estimates | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జూమ్!

Published Thu, Apr 23 2015 11:38 PM | Last Updated on Tue, Oct 9 2018 2:28 PM

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జూమ్! - Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ జూమ్!

క్యూ4 లాభంలో 21 శాతం వృద్ధి; రూ. 2,807 కోట్లు
- అధిక నికర వడ్డీ ఆదాయాల,మార్జిన్ల తోడ్పాటు
- మొండిబకాయిలు తగ్గుముఖం...

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2014-15, క్యూ4)లో నికర లాభం 21 శాతం ఎగబాకి రూ.2,807 కోట్లుగా నమోదైంది.

అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,327 కోట్లుగా ఉంది. ప్రధానంగా నికర వడ్డీ ఆదాయాలు(ఎన్‌ఐఐ) పుంజుకోవడం లాభాల జోరుకు దోహదం చేసింది. కాగా, బ్యాంక్ మొత్తం ఆదాయం క్యూ4లో రూ.15,570 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆదాయం రూ.12,790 కోట్లతో పోలిస్తే 21.7 శాతం వృద్ధి చెందింది. కాగా, గతేడాదివరకూ బ్యాంక్ త్రైమాసిక లాభాల్లో 30% స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది.
 
ఎన్‌ఐఐ 21 శాతం అప్...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎన్‌ఐఐ మార్చి క్వార్టర్‌లో రూ.6,013 కోట్లకు పెరిగింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.4,953 కోట్లతో పోలిస్తే 21.4 శాతం ఎగసింది. ఇక బ్యాంక్ ఎన్‌ఐఎం క్యూ4లో 4.4 శాతంగా నమోదైంది. బ్యాంకింగ్ పరిశ్రమలో ఇదే అత్యధికమని బ్యాంక్ డిప్యూటీ ఎండీ పరేష్ సుక్తాంకర్ చెప్పారు. బేస్ రేటులో 0.15 శాతం కోత ప్రకటించినప్పటికీ.. ఎన్‌ఐఎంను ఈ స్థాయిలోనే కొనసాగించగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. వడ్డీయేతర ఆదాయం(ఫీజులు ఇతరత్రా) 30 శాతం ఎగసి రూ.2,564 కోట్లకు చేరింది.
 
మొండిబకాయిలు తగ్గాయ్...
బ్యాంక్ మొండిబకాయిలు(ఎన్‌పీఏ) క్యూ4లో మరింత మెరుగుపడ్డాయి. స్థూల ఎన్‌పీఏలు 1 శాతం నుంచి 0.93 శాతానికి తగ్గింది. నికర ఎన్‌పీఏలు 0.3 శాతం నుంచి 0.2 శాతానికి దిగొచ్చాయి. అయితే, ప్రొవిజనింగ్ మొత్తాన్ని బ్యాంక్ రూ.286 కోట్ల నుంచి రూ.577 కోట్లకు పెంచింది. రుణ పునర్‌వ్యవస్థీకరణ కంపెనీ(ఏఆర్‌సీ)లకు రూ.500 కోట్ల విలువైన రుణాలను క్యూ4లో విక్రయించింది.
 
పూర్తి ఏడాదికి ఇలా...: 2014-15 పూర్తి ఏడాదిలో బ్యాంక్ నికర లాభం రూ. 10,216 కోట్లుగా నమోదైంది. రూ.10 వేల కోట్ల మార్కు దాటడం ఇదే తొలిసారి. అంతక్రితం ఏడాది రూ.8,478 కోట్లతో పోలిస్తే లాభం 20.5% వృద్ధి చెందింది. మొత్తం ఆదాయం 17.1% వృద్ధితో రూ.49,055 కోట్ల నుంచి రూ.57,466 కోట్లకు ఎగసింది.
 
ఇతర ముఖ్యాంశాలివీ..

క్యూ4లో బ్యాంక్ 300 కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేసింది. పూర్తి ఏడాదిలో ఈ సంఖ్య 611గా ఉంది. 10 వేల మంది ఉద్యోగులను నియమించుకుంది.
మార్చి క్వార్టర్ రుణాల్లో 21.2% మెరుగైన వృద్ధి నమోదైంది. రిటైల్ విభాగంలో 17%, కార్పొరేట్ విభాగంలో 26% వృద్ధి సాధించింది. మొత్తం రుణాల విలువ రూ.3.65 లక్షల కోట్లకు చేరింది.
గురువారం బీఎస్‌ఈలో బ్యాంక్ షేరు ధర స్వల్పంగా  క్షీణించి రూ.1,013 వద్ద స్థిరపడింది.
 
గృహ రుణాలపై మహిళలకువడ్డీ తగ్గింపు...
ఎస్‌బీఐ, ఐసీఐసీఐల బాటలోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా మహిళలకు గృహ రుణాలపై స్వల్పంగా వడ్డీ తగ్గింపును ప్రకటించింది. మిగతా కస్టమర్లందరికీ 9.9 శాతం వడ్డీ రేటును అమలు చేస్తున్నామని.. మహిళలకు ఈ రేటును 9.85 శాతానికి తగ్గిస్తున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎండీ రేణు సూద్ కర్నాడ్ పేర్కొన్నారు. ‘మహిళా శక్తి’ పేరుతో ఈ ఆఫర్‌ను ఇస్తున్నట్లు చెప్పారు. జాయింట్ ఓనర్‌గా లేదా సింగిల్‌గా కొనుగోలు చేసే ప్రాపర్టీపైన మాత్రమే ఈ రేటు వర్తిస్తుంది అని అమె చెప్పారు. ప్లాట్‌లకు సంబంధించిన రుణాలపై రేటు 9.9 శాతమే ఉంటుందని కూడా కర్నాడ్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement