
హీరో మోటో లాభం రూ.914 కోట్లు
జూన్ క్వార్టర్లో గరిష్ట విక్రయాలు కంపెనీ చరిత్రలోనే రికార్డు
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ జూన్ త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. రూ.8,613 కోట్ల ఆదాయంపై రూ.914 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో నమోదైన ఫలితాలతో పోల్చి చూస్తే లాభం 3.5 శాతం, ఆదాయం 7.5 శాతం వృద్ధి చెందాయి. జూన్ త్రైమాసికంలో కంపెనీ 18,53,647 వాహనాలను విక్రయించింది.
కంపెనీ చరిత్రలో ఓ త్రైమాసికంలో గరిష్ట విక్రయాల రికార్డు ఇది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 17,45,389తో పోలిస్తే 6.2 శాతం ఎక్కువ. జూన్ త్రైమాసికంలో కంపెనీ చరిత్రలోనే గరిష్ట సంఖ్యలో వాహనాలను విక్రయించడం ద్వారా దేశీయ మోటార్‌సైకిల్ మార్కెట్లో తమ స్థానాన్ని మరింత సుస్థిరపరుచుకున్నట్టు హీరోమోటో కార్ప్ చైర్మన్, ఎండీ పవన్‌ముంజాల్ తెలిపారు. మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడడంతోపాటు కంపెనీ వాహన శ్రేణికి డిమాండ్ ఉండడమే ఇందుకు కారణమన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటుంటే భారత్‌లో మాత్రం స్థిరమైన ఆర్థిక, రాజకీయ వాతావరణం నెలకొందని వ్యాఖ్యానించారు. ద్విచక్ర వాహన మార్కెట్ లీడర్‌గా తయారీరంగ వృద్ధిలో తమవంతు పాత్ర పోషించేందుకు మరిన్ని పెట్టుబడులు, ఆవిష్కణలపై దృష్టి పెడతామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీకి ఆశాజనకంగా ఉంటుందన్నారు. రానున్న క్వార్టర్లలో పలు ఉత్పత్తులను ఆవిష్కరిస్తామని, దేశీయంగా అగ్రస్థానాన్ని కాపాడుకుంటూనే ప్రపంచ మార్కెట్లలోనూ విస్తరిస్తామని చెప్పారు.