ఇక ఆర్థిక వెలుగులు!
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ సారథ్యంలో వచ్చే సోమవారం అధికారం చేపట్టనున్న బీజేపీ ప్రభుత్వంపై వాణిజ్య, పారిశ్రామిక రంగాలు పూర్తి ఆశావహంగా ఉన్నాయి. మోడీ పాలనలో పారిశ్రామిక ప్రగతి వెల్లివిరుస్తుందనీ, ఆర్థిక రథ చక్రాలు పరుగందుకుంటాయనే నమ్మకం ఆయా వర్గాల్లో ద్యోతకమవుతోంది. కరెంటు అకౌంటు లోటు, ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తాయనే విశ్వాసం వ్యక్తమవుతోంది.
హామీలు అమలు చేస్తే చాలు: జేపీ మోర్గాన్ ఏఎంసీ
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను బీజేపీ అమలు చేస్తే సమీప భవిష్యత్తులోనే ఆర్థిక వ్యవస్థ జోరందుకుంటుందని జేపీ మోర్గాన్ ఏఎంసీ తెలిపింది. కొత్త ప్రభుత్వం తగిన చర్యలు చేపడితే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి ఆర్థిక పరిస్థితి మెరుగవడం మొదలవుతుంది. తద్వారా కంపెనీల లాభాలు పెరుగుతాయి. సెన్సెక్స్ మరింత ఊపందుకుంటుందని సంస్థ పేర్కొంది.
2.3 శాతానికి క్యాడ్...: సిటీ గ్రూప్ అంచనా
ఎగుమతుల పెంపు, దిగుమతుల తగ్గింపుపై మోడీ సర్కార్ దృష్టిసారించే అవకాశం ఉండడంతో ఈ ఏడాది కరెంటు అకౌంటు లోటు (క్యాడ్) స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 2.3 శాతం ఉండవచ్చని సిటీగ్రూప్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2013-14)లో క్యాడ్ 3,600 కోట్ల డాలర్లు లేదా జీడీపీలో రెండు శాతం వరకు ఉండవచ్చని పేర్కొంది. ఈ ఏడాది ఇది కొంచెం హెచ్చుస్థాయిలో 2.3 శాతం వరకు ఉండవచ్చని అంచనావేసింది.
బుధవారం విడుదల చేసిన నివేదికలో సిటీగ్రూప్ తెలిపిన అంశాలు:
చమురు, బొగ్గు, ఇనుప ఖనిజం రంగాలు 2014-15లో క్యాడ్‌పై ప్రభావం చూపే అవకాశముంది. ముడిచమురు ధరలు పెరిగి, డిమాండు క్షీణించడంతో ఈ ఏడాది చమురు దిగుమతుల బిల్లు 10 శాతం మేరకు తగ్గవచ్చు.
ఆర్థిక అంశాలపై బీజేపీ ధోరణినిబట్టి అభివృద్ధిని ప్రోత్సహించే చర్యలను కొత్త ప్రభుత్వం చేపట్టవచ్చు. రికవరీ గణాంకాలు క్రమక్రమంగా వెల్లడవుతాయి.
ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండవచ్చు. వచ్చే ఏడాది ఇది 6.5 శాతానికి పెరగవచ్చు.
కొత్త ప్రభుత్వం చేపట్టబోయే సంస్థాగత సవరణల ఫలితాలు 2015-16, 2016-17లలో ప్రతిబింబిస్తాయి.
మెరుగైన పాలన కావాలి: వొడాఫోన్ ఇండియా
మోడీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం మెరుగైన పాలనను, వాణిజ్య వ్యవహారాల్లో మరింత పారదర్శకతను అందిస్తుందని టెలికం దిగ్గజం వొడాఫోన్ పేర్కొంది. నిన్నటి వరకు మోడీ ముఖ్యమంత్రిగా ఉన్న గుజరాత్‌లో సుపరిపాలనను చూశామని కంపెనీ ఎండీ, సీఈఓ మార్టెన్ పీటర్స్ చెప్పారు. గుజరాత్‌లో వొడాఫోన్ మార్కెట్ లీడర్‌గా ఉంది.
సహజ వనరులను పూర్తిస్థాయిలో వినియోగించాలి: వేదాంత చైర్మన్ అగర్వాల్
దేశంలో వెలికితీయకుండా ఉన్న సహజ వనరులను సద్వినియోగపర్చుకునే చర్యలను మోడీ సర్కార్ చేపడుతుందని ఆశిస్తున్నట్లు వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ చెప్పారు. ఇందుకుగాను తగిన సంస్కరణలకు, విధాన నిర్ణయాలకు కొత్త ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.
ధరలపై ఉన్నతాధికారుల సమీక్ష
నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం త్వరలోనే అధికారాన్ని చేపట్టనున్న నేపథ్యంలో దేశంలో ధరల పరిస్థితిని ఉన్నతాధికారులు మదింపుచేశారు. రుతుపవనాలు విఫలమైతే పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రభుత్వ సన్నద్ధతను పరిశీలించారు. పెట్టుబడుల ప్రతిపాదనలను సమీక్షించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్ల కార్యదర్శులతో కేబినెట్ సెక్రటరీ అజిత్ సేథ్ బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా అంశాలపై చర్చించారు. రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం చూపితే ఆహార ధాన్యాల లభ్యత ఏస్థాయిలో ఉంటుందనే అంశంపై సమావేశంలో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.