ఎంటర్టైన్మెంట్లో ‘హంగామా’
♦ కంటెంట్‌ను విస్తృతం చేస్తున్న కంపెనీ
♦ పిల్లల కోసం త్వరలో యానిమేషన్ వీడియోలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిజిటల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఉన్న హంగామా.కామ్ మరింత వినోదాన్ని పంచేందుకు రెడీ అయింది. వేలాది సినిమాలు, పాటలను నిక్షిప్తం చేసిన ఈ సంస్థ కొద్ది రోజుల్లో పిల్లల కోసం యానిమేషన్ వీడియోలను పరిచయం చేయనుంది. అలాగే టీవీ సీరియళ్లను సైతం పొందుపరుస్తామని హంగామా.కామ్ సీఈవో సిద్ధార్థ రాయ్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. రానున్న రోజుల్లో సొంతంగా టీవీ సీరియళ్లు, యానిమేషన్ కంటెంట్‌ను రూపొందిస్తామని చెప్పారు.
తెలుగు కంటెంట్ కోసం ఇటీవలే మా టీవీతోపాటు సన్ టీవీ నెట్‌వర్క్‌తోనూ ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. తమ నెట్‌వర్క్‌లోకి లాగిన్ అయిన కస్టమర్ సగటున 47 నిముషాలు వీడియోలను చూస్తున్నట్టు చెప్పారు. 4జీ నెట్‌వర్క్ విస్తృతమైతే పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. డేటా చార్జీలు త గ్గడం, నాణ్యమైన సేవలు అందుతాయి కాబట్టి కస్టమర్ల సంఖ్య అధికమవుతుందని పేర్కొన్నారు.
మార్చికల్లా 2.5 కోట్లమంది..
వీడియో ఆన్ డిమాండ్ సేవలందిస్తున్న హంగామా ప్లే కస్టమర్లు నెలవారీ చందా రూ.199 చెల్లించాలి. ఎన్ని సినిమాలనైనా అపరిమితంగా చూడొచ్చు. చందాదారుగా కొనసాగినంత కాలం సినిమాలను డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో వీక్షించే వీలుంది. ఒక కస్టమర్ తన ఖాతా కింద అయిదు ఉపకరణాల్లో ఈ యాప్‌ను వాడొచ్చు. హంగామా, హంగామా ప్లే వినియోగదార్లు 6.7 కోట్ల మందికిపైగా ఉన్నారు. వీరిలో 1.75 కోట్లకుపైగా ప్రీమియం చందాదారులున్నారు. చిన్న వీడియోలను చూసే వారి సంఖ్య ఏడాదిలో 16 నుంచి 34%కి ఎగసింది. డిసెంబరుకల్లా ఇది 55 శాతానికి చేరడం ఖాయమని సిద్ధార్థ రాయ్ వెల్లడించారు. 2017 మార్చికల్లా మొత్తం చందాదారుల సంఖ్య 20 కోట్లకు, ప్రీమియం చందాదారులు 2.5 కోట్లకు చేరొచ్చని అన్నారు. గ్రామీణ ప్రాంత కస్టమర్ల వాటా 30% ఉంటుందని వివరించారు.