కోల్ కత్తా : భారత్ ను స్మార్ట్ సిటీలుగా రూపకల్పన చేయాలని మోదీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ స్మార్ట్ సిటీలతో రూపకల్పనతో పాటు మన ఇల్లుల్ని కూడా స్మార్ట్ గా ఉంచాలని ఆకాంక్షించారు ఖరగ్ పూర్ ఐఐటీ విద్యార్థులు. ఈ నేపథ్యంలోనే స్మార్ట్ హోమ్స్ కోసం, స్మార్ట్ యాప్ కు శ్రీకారం చుట్టారు. మొబైల్ స్క్రీన్ పై ఒక్క టచ్ చేస్తే చాలు, ఇంటి మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకునేలా 'అలైవ్ హోమ్' యాప్ ను టెక్నాలజీ యూజర్ల ముందుకు తీసుకొచ్చారు.
ఐఐటీ ఖరగ్ పూర్ కు చెందిన ఐదో ఏడాది ఉత్సాహవంతులైన టెక్నాలజీ విద్యార్థులు పూనమ్ గుప్తా, అలోక్ దీక్షిత్ లు ఈ అప్లికేషన్ ను రూపొందించారు. స్మార్ట్ హోమ్ లోపలున్న ప్రతి పనిని నిర్వహించడానికి ఈ యాప్ ఉపయోగపడనుంది. ఇంట్లో ఉన్న ప్రతీ ఎలక్ట్రానిక్ డివైజ్ లను ఈ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. యూజర్ల మొబైల్ డివైజ్ ద్వారా వాటిని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు. హోమ్ ఆటోమేషన్ ఇప్పటికే మార్కెట్లో ఉంది. కానీ అది ఎంతో ఖరీదైనది. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ పరంగా ఎక్కువ మందికి యాక్సెస్ లో ఉంచేలా ఈ యాప్ ను రూపొందించామని ఈ యాప్ సృష్టికర్తలో ఒకరైన అలోక్ దీక్షిత్ చెప్పారు. ఈ హై ఎండ్ టెక్నాలజీని తక్కువ ధరకే యూజర్లకు అందిస్తామని పేర్కొన్నారు.
ఇళ్లలో ఉండే స్విచ్ బోర్డులకు బదులు ఈ యాప్ ద్వారా స్మార్ట్ స్విచ్ లను వాడుకోవచ్చు. అదేవిధంగా ప్రతి ఎలక్ట్రానిక్ డివైజ్ కు ఈ యాప్ రిమోట్ కంట్రోల్ ల ఉపయోగపడుతుంది. ఇంట్లో ఏసీని కాని, గ్రీసర్ ను కాని ఆన్ చేసి మర్చిపోయి ఆఫీస్ కు వచ్చేస్తే ఈ యాప్ యూజర్లకు నోటిఫికేషన్ అలారమ్ ఇస్తుంది. ఈ అలారమ్ తో ఆఫీసు నుంచే వాటిని ఆఫ్ చేసుకోవచ్చు. ఎవరైనా మీ ఇంట్లోకి ప్రవేశించి లైట్లు వేస్తే ఈ యాప్ లోని స్మార్ట్ స్విచ్ ఆప్షన్ వల్ల వెంటనే యూజర్లకు తెలిసిపోతుంది. గతేడాది నుంచి ఈ యాప్ రూపొందించడానికి ఐఐటీ విద్యార్థులు అహర్నిశలు కృషిచేశారు. దీనిపై వారు పేటెంట్ ను కూడా దాఖలు చేసుకున్నారు. ఈ యాప్ ఇన్ స్టాలేషన్ ద్వారా ఖరగ్ పూర్ ఐఐటీని కూడా స్మార్ట్ క్యాంపస్ గా తీర్చిదిద్దారు.
'స్మార్ట్ హోమ్స్' కు స్మార్ట్ యాప్
Published Tue, Jun 14 2016 11:25 AM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM
Advertisement