
న్యూఢిల్లీ: డిజిటలైజేషన్ పెరుగుతున్న నేపథ్యంలో డేటా ప్రైవసీకి సంబంధించి సాధ్యమైనంత త్వరలో ఒక చట్టాన్ని రూపొందించాలని ఆర్థిక అంశాల పార్లమెంటరీ స్థాయీ సంఘం.. ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే, సమాచార మౌలిక అంశాలపై సమన్వయం కోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం వీరప్ప మొయిలీ సారథ్యంలోని స్థాయీ సంఘం ఈ మేరకు డిజిటల్ ఎకానమీపై నివేదికను పార్లమెంటుకు సమర్పించింది.
సైబర్ నేరాలను సమర్ధంగా ఎదుర్కొనేందుకు సుశిక్షితులైన నిపుణుల కొరతపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. దేశం డిజిటల్ వైపు మళ్లుతున్న తరుణంలో క్లోనింగ్ వంటి ఏటీఎం మోసాలు మొదలైనవి భారీగా పెరుగుతున్నాయని, సామాన్యులు మోసాలబారిన పడుతున్నారని పేర్కొంది. ఈ నేపథ్యంలో డేటా భద్రత కోసం చట్టం తేవాలని, మోసాలపై ఫిర్యాదులు చేసేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించింది.