
డాక్టర్ రెడ్డీస్‌కు ఇంపోర్ట్ అలర్ట్?
ఎగుమతులకు ఇబ్బంది తప్పదంటున్న విశ్లేషకులు
యూనిట్లన్నీ థర్డ్‌పార్టీతో తనిఖీ చేయించాలన్న యూఎస్‌ఎఫ్‌డీఏ
మరింత ఆలస్యం కానున్న కొత్త ఔషధాల అనుమతులు
అమెరికా వ్యాపారం 20% దెబ్బతినే అవకాశం షేరు మరో 4% డౌన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌కు యూఎస్ ఎఫ్‌డీఏ రూపంలో వచ్చిన కష్టాలు ఇప్పట్లో తీరేట్లు కనిపించడం లేదు. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని వార్నింగ్ ఇచ్చిన మూడు యూనిట్లతో పాటు... కంపెనీకి చెందిన అన్ని యూనిట్లను థర్డ్‌పార్టీతో మరోసారి తనిఖీ చేయించమని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఏ) తాజాగా ఆదేశించినట్లు తెలిసింది. ఈ మూడు యూనిట్లకు ఇంపోర్ట్ అలర్ట్ తప్పేట్లు లేదని, ఇదే జరిగితే ఈ యూనిట్ల నుంచి అమెరికాకు ఎగుమతులు ఆగిపోవడమే కాకుండా కొత్త ఔషధాలకు యూఎస్ ఎఫ్‌డీఏ అనుమతులు రావడం మరింత ఆలస్యం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత వారం యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి శ్రీకాకుళం, మిర్యాలగూడలోని ఏపీఏ యూనిట్లకు, విశాఖ సమీపంలోని దువ్వాడలోని క్యాన్సర్ డ్రగ్ ఫార్ములేషన్ యూనిట్‌కు వార్నింగ్ లెటర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ యూనిట్లలో డేటా సెక్యూరిటీ, ల్యాబ్‌లో పరిశోధించిన ఫలితాలను భద్రపర్చడం, ఏదైనా ఒక సమస్య ఉత్పన్నమైతే వాటిని పరిశోధించడానికి సరైన ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ లేకపోవడం వంటివి 483 అబ్జర్వేషన్స్ కింద ఎఫ్‌డీఏ లేవనెత్తిందని తెలిసింది.
ఇదే విషయమై సోమవారంనాడు పలువురు సంస్థాగత ఇన్వెస్టర్లతో కంపెనీ సీఈఓ జి.వి.ప్రసాద్ టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. వార్నింగ్ లెటర్ వచ్చిన మూడు యూనిట్లలో తయారయ్యే ఉత్పత్తులను వేరే యూనిట్లకు తరలిస్తామని, ఎఫ్‌డీఏ ఎత్తి చూపిన అంశాలపై తగు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ఈ వార్నింగ్ లెటర్ వల్ల కొత్త ఔషధాల అనుమతులు మరింత జాప్యం జరగొచ్చని చెప్పారు. దీంతో ఈ ఏడాది అమెరికా వ్యాపారంలో 20 శాతం నష్టపోవాల్సి ఉంటుందని కంపెనీ ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. గతేడాది అమెరికా నుంచి సుమారు రూ. 6,500 కోట్ల ఆదాయాన్ని కంపెనీ ఆర్జించింది. దీని ప్రకారం ఈ ఏడాది అమెరికా ఆదాయం రూ.1,300 కోట్లు నష్టపోవచ్చని అంచనా. ఈ హెచ్చరిక లేఖలు వచ్చిన యూనిట్లను థర్డ్‌పార్టీతో మరోసారి తనిఖీలు నిర్వహించమని ఎఫ్‌డీఏ చెప్పినట్లు ప్రసాద్ తెలియజేశారు. దీంతో ఈ యూనిట్లలో తయారు చేసే ఔషధాలను వేరే యూనిట్లకు తరలించనున్నారు. కానీ ఇది కూడా అంత సులువైన విషయం కాదని, దీనికి కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని, అంతవరకు వ్యాపారాన్ని కోల్పోవాల్సి ఉంటుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ ఆందోళనల నేపథ్యంలో డాక్టర్ రెడ్డీస్ షేరు సోమవారం కూడా సుమారు 4% క్షీణించి రూ. 3,505 వద్ద ముగిసింది.