
‘మౌలిక’ గ్రూప్ అంతంతే..!
అక్టోబర్‌లో ఎనిమిది కీలక పరిశ్రమల
వృద్ధి రేటు 3.2 శాతం
2014 ఇదే నెలలో ఈ రేటు 9 శాతం
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక పరిశ్రమల గ్రూప్ అక్టోబర్‌లో 3.2 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే నెలలో ఈ గ్రూప్ వృద్ధి రేటు 9 శాతం. సెప్టెంబర్‌లో కూడా ఈ గ్రూప్ వృద్ధి రేటు 3.2 శాతం కావడం గమనార్హం.
మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఎనిమిది పారిశ్రామిక విభాగాల వెయిటేజ్ 38 శాతం. బొగ్గు, క్రూడ్ ఆయిల్, సహజవాయువు, రిఫైనరీ ప్రొడక్టులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు వీటిలో ఉన్నాయి. క్రూడ్ ఆయిల్, స్టీల్ ఉత్పత్తి పేలవ పనితీరు మొత్తం మౌలిక రంగం గ్రూప్ మందగమన స్థితికి కారణమైంది. అక్టోబర్‌లో ఎనిమిది రంగాల పనితీరునూ వార్షిక ప్రాతిపదికన వేర్వేరుగా చూస్తే...
వృద్ధిలో 4...
బొగ్గు: వృద్ధి రేటు 16.4 శాతం నుంచి 6.3 శాతానికి పడింది.
సిమెంటు: క్షీణత (-1.2%) లోంచి 11.7% వృద్ధిలోకి మళ్లింది.
ఎరువులు: భారీ వృద్ధిని నమోదుచేసుకుంది. -7 శాతం క్షీణతలోంచి 16.2 శాతం వృద్ధి నమోదుచేసుకుంది.
విద్యుత్: వృద్ధి 13.7 శాతం నుంచి 8.8 శాతానికి తగ్గింది.
క్షీణతలో 4...
క్రూడ్ ఆయిల్: 2014 అక్టోబర్‌లో ఈ రంగం 1 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. అయితే 2015 అక్టోబర్‌లో అసలు వృద్ధిలేకపోగా -2.1 క్షీణతలోకి జారింది.
రిఫైనరీ ప్రొడక్టులు: క్రూడ్ ఆయిల్ తరహాలోనే ఈ రంగం కూడా 4.2% వృద్ధి రేటు నుంచి -4.4 % క్షీణతలోకి జారింది.
సహజవాయువు: -3.9 క్షీణత... -1.8 శాతానికి తగ్గింది.
స్టీల్: 14.2 శాతం వృద్ధి రేటు -1.2 శాతం క్షీణతలోకి జారింది.
ఏడు నెలల్లో ఇలా...
2015-16 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకూ చూస్తే... ఈ గ్రూప్ వృద్ధి రేటు 2.5 శాతంగా ఉంది. 2014-15 ఇదే ఏడు నెలల కాలంలో ఈ వృద్ధి రేటు 5.6 శాతం.