రిటర్నుల సవరణ పేరుతో మోసం చేస్తే చర్యలు
ఆదాయపన్ను శాఖ హెచ్చరిక
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆదాయపన్ను రిటర్నుల్లో పెద్ద ఎత్తున సవరణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని కేంద్రం హెచ్చరించింది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన మొత్తాలను గత సంవత్సరపు ఆదాయంగా చూపించే చర్యలకు పాల్పడితే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం ఓ వ్యక్తి గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాఖలు చేసిన రిటర్నులకు సవరణలు చేయవచ్చు.
తాజాగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో భారీగా పన్ను చెల్లించకుండా తప్పించుకునేందుకు కొందరు... లెక్కల్లో చూపని తమ సంపదను గత సంవత్సరం ఆదాయంగా చూపించే ప్రయత్నం చేస్తుండడంతో ఆదాయపన్ను శాఖ తీవ్రంగా హెచ్చరించింది. ఆదాయాన్ని స్వచ్ఛందంగా వెల్లడిస్తే 50 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికి బదులు గత సంవత్సరపు ఆదాయంగా చూపిస్తే 30 శాతం పన్నుతోనే బయటపడేందుకు అవకాశం ఉంది. కానీ ఐటీ శాఖ నోటీసులిచ్చి, ఇలా సవరించినట్లు తేలిస్తే.. భారీ పన్ను, జరిమానానూ చెల్లించాల్సి ఉంటుంది.
లోపాల సవరణకే పరిమితం...
‘‘సెక్షన్ 139(5) అన్నది రిటర్నుల్లో ఏదైనా తప్పిదం, పొరపాటు ఉంటే సవరణ పేర్కొనడానికి మాత్రమే. అంతేకానీ, లోగడ పేర్కొన్న ఆదాయానికి గణనీయంగా మార్పులు చేసేందుకు కాదు’’ అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తన ప్రకటనలో స్పష్టం చేసింది. నవంబర్ 8 తర్వాత (పెద్ద నోట్ల రద్దు) కొంత మంది పన్ను చెల్లింపుదారులు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు పేర్కొంది.