మొబైల్స్‌దే మెజారిటీ వాటా | Indian e-commerce consumers hold back purchases before sale periods | Sakshi
Sakshi News home page

మొబైల్స్‌దే మెజారిటీ వాటా

Published Tue, Dec 24 2019 1:10 AM | Last Updated on Tue, Dec 24 2019 10:50 AM

Indian e-commerce consumers hold back purchases before sale periods - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో ఈ–కామర్స్‌ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇద్దరు వినియోగదార్లలో ఒకరు తొలిసారిగా ఆన్‌లైన్‌ వేదికగా వస్తువులను కొనుగోలు చేస్తున్నవారే. ఈ ఏడాది మే–జూలైతో పోలిస్తే ఆగస్టు–అక్టోబరులో మొత్తం కస్టమర్లలో వీరి శాతం అత్యధికంగా 56 శాతానికి చేరుకుందని నీల్సన్‌ నివేదిక చెబుతోంది. 10 లక్షలకుపైగా జనాభా కలిగిన 52 నగరాల్లోని 1,90,000 మంది ఆన్‌లైన్‌ కస్టమర్ల షాపింగ్‌ తీరును ఈ నివేదికలో వివరించింది. కొత్త కస్టమర్లకు మొబైల్స్‌ తొలి ప్రాధాన్యతగా నిలిచింది. 28 సెప్టెంబరు–25 అక్టోబరు మధ్య ఫెస్టివ్‌ పీరియడ్‌లో వీరు ఖర్చు చేసిన మొత్తం విలువలో మొబైల్స్‌ వాటా ఏకంగా 53% ఉంది.  

అధిక ఆర్డర్లు ఎఫ్‌ఎంసీజీలో..
2019 మే–ఆగస్టు కాలంలో జరిగిన షాపింగ్‌లో విలువ పరంగా మొబైల్స్‌ 48 శాతం, ఫ్యాషన్‌ 16 శాతం కైవసం చేసుకున్నాయి. ఇక అత్యధిక ఆర్డర్లు (పరిమాణం) ఎఫ్‌ఎంసీజీ విభాగంలో 56 శాతం చోటుచేసుకోవడం విశేషం. ఎఫ్‌ఎంసీజీలో ఎక్కువ ఆర్డర్లు 50 లక్షలు ఆపై జనాభా ఉన్న మెట్రో నగరాల నుంచే వస్తున్నాయి. 50 లక్షల లోపు జనాభా ఉన్న ప్రథమ శ్రేణి నగరాల నుంచి మొబైల్‌ ఫోన్ల కోసం 50 శాతం ఆర్డర్లు వస్తే.. మెట్రోల నుంచి ఇది 38 శాతంగా ఉంది. ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ విభాగంలో మే–అక్టోబరు మధ్య నాలుగింట మూడు భాగాలు దుస్తులు, పాదరక్షలు ఉన్నాయి.  

షాపింగ్‌ రాత్రిపూటే..
మొబైల్స్‌ తర్వాత ఫ్యాషన్, టీవీలు, ఎలక్ట్రానిక్స్‌ వంటివి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్ల విషయంలో రెండు, మూడవసారి మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్‌కు నూతన వినియోగదార్లు మొగ్గు చూపుతున్నారు. ఫెస్టివల్‌ సీజన్లో ప్రైమ్‌ టైంలో అంటే రాత్రి 8–11 గంటల మధ్య అత్యధికంగా 23 శాతం షాపింగ్‌ జరిగింది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 వరకు 17 శాతం షాపింగ్‌ నమోదైంది. పండుగల సమయంలో మూడు నాలుగు రెట్ల అమ్మకాలు జరిగాయి. ఇండిపెండెన్స్‌ డే సేల్‌ తర్వాత సాధారణంగా నమోదైన విక్రయాలు తిరిగి ఫెస్టివ్‌ పీరియడ్‌ వచ్చే సరికి అనూహ్యంగా ఎగబాకాయి. 28 సెప్టెంబరుతో మొదలైన ఫెస్టివ్‌ సీజన్‌ తొలి వారంలో 43 శాతం సేల్స్‌ జరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement