వాట్స్‌యాప్‌ను హోరెత్తించారు..
• ఒకే రోజు 1400 కోట్ల మెసేజ్‌లు
• భారత్‌లో ఇదే ఆల్‌టైం గరిష్టం
న్యూఢిల్లీ: దేశంలోని ప్రజలు వాట్స్‌యాప్‌ను విపరీతంగా వాడేస్తున్నారు. మరీ ఎంతలా అంటే డిసెంబర్ 31న 1400 కోట్ల వాట్స్‌యాప్ మెసేజ్‌లను పంపుకున్నారు. భారత్ నుంచి ఇదే ఆల్‌టైం గరిష్టం. యూజర్లు మునుపెన్నడూ కూడా ఇంత ఎక్కువగా వాట్స్‌యాప్ మెసేజ్‌లు పంపుకోలేదు. ప్రజలు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవడం కోసం వాట్స్‌యాప్‌ను హోరెత్తించారు. ఫేస్‌బుక్‌కు చెందిన ఈ వాట్స్‌యాప్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్.
సంస్థకు భారత్‌లో 16 కోట్ల మంది యూజర్లున్నారు. ఇక వీరి సంఖ్య అంతర్జాతీయంగా వంద కోట్లకుపైగానే ఉంది. టెలికం కంపెనీలు న్యూ ఇయర్, దీపావళి వంటి రోజుల్లో ఎస్‌ఎంఎస్‌లకు మామూలు చార్జీలను వసూలు చేస్తుంటాయి. కానీ ఇక్కడ వాట్స్‌యాప్‌లో ఉచితంగా (డేటా చార్జీలు మినహా) ఎన్ని మెసేజ్‌లనైనా పంపుకోవచ్చు. అందుకే వాట్స్‌యాప్‌కు ఆదరణ బాగా పెరిగిపోతోంది. కాగా గతేడాది దీపావళి రోజు వాట్స్‌యాప్ యూజర్లు 800 కోట్ల మెసేజ్‌లను పంపుకున్నారు.
మీడియా ఫైల్స్‌దే పైచెయ్యి..
డిసెంబర్ 31న పంపుకున్న వాట్స్‌యాప్ మెసేజ్‌లలో మీడియా ఫైల్స్ సింహభాగం ఆక్రమించాయి. ఫొటోలు, జీఐఎఫ్‌లు, వీడియోలు, వాయిస్ మెసేజ్‌లు సంయుక్తంగా 32 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఫొటో మెసేజ్‌లు 310 కోట్లుగా, జీఐఎఫ్ మెసేజ్‌లు 70 కోట్లుగా, వీడియో మెసేజ్‌లు 61 కోట్లుగా ఉన్నాయి.