
శాన్ ఫ్రాన్సిస్కో: త్వరలో కొత్త ఐఫోన్ వెర్షన్‌ను ప్రవేశపెట్టనుందన్న వార్తలకు ఊతమిస్తూ టెక్ దిగ్గజం యాపిల్ వచ్చే నెల 10న సిలికాన్ వేలీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఇన్విటేషన్లు పంపింది. సాధారణంగా ఏటా క్రిస్మస్ షాపింగ్ సీజన్‌కు ముందు.. ఇలాంటి కార్యక్రమంలోనే యాపిల్ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ వస్తోంది. ఈసారీ సెప్టెంబర్ 10న జరిగే కార్యక్రమంలో ’ఐఫోన్ 11’ హ్యాండ్‌సెట్స్‌ను కూడా ఆవిష్కరించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం మూడు ఐఫోన్ 11 మోడల్స్‌ను ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. ఐఫోన్ ఎక్స్‌ఎస్ మ్యాక్స్‌ని అప్‌గ్రేడ్ చేసి ఎక్స్‌ఎస్, ఎక్స్‌ఆర్ మోడల్స్‌ను కొత్త రూపంలో ఆవిష్కరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఐఫోన్ ఎక్స్‌ఎస్ సిరీస్ స్థానంలో వచ్చే కొత్త ఐఫోన్ 11 మోడల్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా ఉండవచ్చన్న అంచనాలు ఉన్నాయి.