
కోవిడ్-19కు వ్యాక్సిన్‌పై ఆశలతో ప్రపంచ మార్కెట్లు బలపడటంతో దేశీయంగానూ ఇన్వెస్టర్లకు హుషారొచ్చింది. కొనుగోళ్లకు ఆసక్తి చూపినప్పటికీ కొంత తడబాటు చూపడంతో తొలి పావు గంటలో దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులు ఎదుర్కొన్నాయి. తదుపరి కొనుగోళ్లదే పైచేయికావడంతో జోరందుకున్నాయి. చివరి గంటన్నర సమయంలో మరింత దూకుడు చూపాయి. వెరసి సెన్సెక్స్ 420 పాయింట్లు జంప్‌చేసి 36,472 వద్ద నిలవగా.. నిఫ్టీ 122 పాయింట్లు జమ చేసుకుని 10,740 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 36,525 వద్ద గరిష్టాన్ని తాకగా.. 36,038 వద్ద కనిష్టానికీ చేరింది. నిఫ్టీ సైతం 10,755- 10,595 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులు చవిచూసింది.
మీడియా డీలా
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ రంగం 3 శాతం పురోగమించగా.. ఫార్మా, ఆటో, ప్రయివేట్ బ్యాంక్స్ 1.5 శాతం స్థాయిలో ఎగశాయి. మీడియా 1.7 శాతం డీలా పడింది. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫోసిస్ 10 శాతం దూసుకెళ్లగా.. బీపీసీఎల్, సిప్లా, ఎంఅండ్‌ఎం, బ్రిటానియా, ఇండస్‌ఇండ్, నెస్లే, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, డాక్టర్ రెడ్డీస్ 7-3 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే ఇన్‌ఫ్రాటెల్ 7 శాతం పతనమైంది. ఇతర బ్లూచిప్స్‌లో టెక్ మహీంద్రా, ఐటీసీ, జీ, ఐవోసీ, కోల్ ఇండియా, ఎన్‌టీపీసీ, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, యూపీఎల్ 3-1 శాతం మధ్య బలహీనపడ్డాయి.
టెలికం పతనం
డెరివేటివ్ కౌంటర్లలో మ్యాక్స్ ఫైనాన్స్, జిందాల్ స్టీల్, ముత్తూట్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్, ఫెడరల్ బ్యాంక్, మణప్పురం, సెయిల్ 8.3-4.5 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోపక్క ఐడియా 10 శాతం, ఇన్‌ప్రాటెల్ 7 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో అపోలో టైర్, నిట్ టెక్, బంధన్ బ్యాంక్, యూబీఎల్, అపోలో హాస్పిటల్స్ 3-2 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పుంజుకోగా.. స్మాల్ క్యాప్ 0.15 శాతం నీరసించింది. ట్రేడైన షేర్లలో 1078 లాభపడగా.. 1528 నష్టపోయాయి.
భారీ అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 222 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 899 కోట్లు చొప్పున స్టాక్స్‌లో అమ్మకాలు చేపట్టారు. ఇక మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1566 కోట్లు, డీఐఐలు రూ. 650 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.