
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక సంక్షోభంతో మూసివేత అంచుకు చేరిన జెట్ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసే బిడ్డర్ మరికొన్ని రోజుల్లో ముందుకొస్తారని జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్ధాపకుడు నరేష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. బిడ్డింగ్‌కు తుదిగడువు ఈనెల 10న ముగుస్తుండగా వచ్చే వారంలోనే బిడ్డర్‌ను బ్యాంకులు ఖరారు చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. జెట్ ఎయిర్‌వేస్ 26వ వార్షికోత్సవమైన మే 5 (ఆదివారం) తన జీవితంలో అత్యంత విచారకరమైన రోజని ఆయన సంస్థ ఉద్యోగులు రాసిన లేఖలో పేర్కొన్నారు.
గత 25 ఏళ్లుగా మే 5 సంస్థ ఉద్యోగుల్లో ప్రత్యేక స్ధానం ఏర్పరచుకుందని, అయితే ఈ ఏడాది మాత్రం అది అత్యంత విచారకరమైన రోజుగా గడిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు 1993, ఏప్రిల్ 18న తాము ముంబైలో తొలి విమానాన్ని అందుకోగా, ఈ ఏడాది ఏప్రిల్ 18న తాము అమృత్‌సర్ నుంచి ముంబైకి చివరి విమానం నడపడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
జెట్ ఎయిర్‌వేస్‌ను కాపాడేందుకు తాను తన భార్య నీతా చివరినిమిషం వరకూ ప్రయత్నించామని, మార్చి 25న బోర్డు నుంచి వైదొలగడంతో పాటు తన కంపెనీల్లో ఒక కంపెనీ నుంచి రూ 250 కోట్లు సమకూర్చానని, ఎయిర్‌లైన్‌లో తన షేర్లను తనఖా పెట్టానని ఆయన చెప్పుకొచ్చారు. కాగా జెట్ ఎయిర్‌వేస్‌ను దక్కించుకునేందుకు ఎతిహాద్ ఎయిర్‌వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్టనర్స్, ఎన్‌ఐఐఎఫ్ ఆసక్తి కనబరుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment