ఈ ఏడాది జోరుగా కొత్త కొలువులు
న్యూఢిల్లీ: కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జోరుగా కొత్త ఉద్యోగాలివ్వనున్నాయి. గత ఆర్థిక సంవత్సరం కంటే అధికంగానే ఈ ఏడాది కొత్త కొలువులివ్వాలని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రముఖ జాబ్ సెర్చ్, కెరీర్ పోర్టల్ హెడ్‌హన్‌కోస్‌డాట్‌కామ్ నిర్వహించిన సర్వేలో 84 శాతానికి పైగా కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను భారీగానే పెంచుకోనున్నట్లు వెల్లడించాయి.
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య 160 కంపెనీలకు చెందిన హెచ్‌ఆర్, నియామక నిపుణులపై నిర్వహించిన ఈ సర్వే పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు...
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు ఉద్యోగాలిచ్చే విషయంలో ఆచి తూచి వ్యవహరించాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు విస్తరణకు పెద్దపీట వేస్తున్నాయి. దీంతో భారీ సంఖ్యలో కొత్త కొలువులొస్తాయి.
కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందని 6 శాతం కంపెనీలు, ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని 10% కంపెనీలు అంచనా వేస్తున్నాయి.
కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య 10 శాతానికి పైగా పెరుగుతుందని 55 శాతం కంపెనీలు భావిస్తున్నాయి.
ప్రతిభ గల ఉద్యోగుల కోసం కంపెనీలు పోటీపడనున్నందున వేతనాలు బాగానే పెరిగే అవకాశాలున్నాయి.