ఎస్‌బీఐ మేనేజిమెంట్‌లో కీలక మార్పులు! | Key changes in SBI management | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ మేనేజిమెంట్‌లో కీలక మార్పులు!

Published Wed, Oct 11 2017 12:59 AM | Last Updated on Wed, Oct 11 2017 2:33 PM

Key changes in SBI management

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ.. భారీగా పేరుకుపోయిన మొండిబాకీల పరిష్కారానికి మరిన్ని చర్యలు తీసుకుంటోంది. దీనికోసం టాప్, మధ్య స్థాయి మేనేజ్‌మెంట్‌ను పునర్‌వ్యవస్థీకరించి... ఎన్‌పీఏల కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఎండీ హోదా ఉన్న అధికారి దీనికి సారథ్యం వహిస్తారు. ఇటీవలే చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన రజనీష్‌ కుమార్‌.. హోల్‌టైమ్‌ డైరెక్టర్ల ఆధ్వర్యంలోని వివిధ వ్యాపార విభాగాల్లో పలు మార్పులు చేశారు.

‘అనుబంధ బ్యాంకుల విలీనం తరవాత వ్యాపారాన్ని మరింత మెరుగ్గా నిర్వహించేందుకు, ఎన్‌పీఏల రికవరీపై మరింతగా దృష్టి పెట్టేందుకు, మొండిబాకీల సమస్యను పరిష్కరించుకునేందుకు పైస్థాయి మేనేజ్‌మెంట్లో మార్పులు అవసరమని నిర్ణయించాం’’ అని ఈ నెల 7న సంస్థ సిబ్బందికి అంతర్గతంగా పంపిన లేఖలో కుమార్‌ పేర్కొన్నారు. క్యూ1లో దాదాపు రెండంకెల స్థాయికి పెరిగిన ఎన్‌పీఏలపై దృష్టి పెట్టేందుకు రజనీష్‌ కుమార్‌.. ఎండీ ఆధ్వర్యంలో నడిచేలా స్ట్రెస్డ్‌ అసెట్స్‌ రిజల్యూషన్‌ గ్రూప్‌ (ఎస్‌ఏఆర్‌జీ) పేరిట ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.

అయితే, ఎండీ హోదాలో ఎవరికి బాధ్యతలిస్తారనేది వెల్లడించలేదు. మేనేజ్‌మెంట్‌ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా కార్పొరేట్, గ్లోబల్‌ బ్యాంకింగ్‌ విభాగానికి ఎండీగా నియమితులైన బి. శ్రీరామ్‌... కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎంపికయ్యే దాకా ఎస్‌ఏఆర్‌జీ విభాగాన్ని కూడా పర్యవేక్షిస్తారు. జూన్‌ ఆఖరు నాటికి ఎస్‌బీఐ స్థూల ఎన్‌పీఏలు 7.40 శాతం నుంచి 9.97 శాతానికి, నికర ఎన్‌పీఏలు 4.36 శాతం నుంచి 5.97 శాతానికి పెరిగాయి.

మూడీస్‌ అనలిటిక్స్‌తో జట్టు..: రుణాల మంజూరుకు సంబంధించి మదింపు ప్రక్రియలో ఉద్యోగులకు తగు శిక్షణ ఇచ్చేందుకు మూడీస్‌ అనలిటిక్స్‌తో ఎస్‌బీఐ ఒప్పందం చేసుకుంది. దీని కింద.. దేశీ బ్యాంకింగ్‌ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన సర్టిఫికెట్‌ ఇన్‌ కమర్షియల్‌ క్రెడిట్‌ (సీఐసీసీ) ప్రోగ్రాంలో ఎస్‌బీఐ సిబ్బందికి మూడీస్‌ శిక్షణనిస్తుంది.

ముంబైలో ఇన్నోవేషన్‌ సెంటర్‌..
బ్యాంకింగ్‌ కార్యకలాపాల్ని విస్తరించి, నవకల్పనలను ప్రోత్సహించే దిశగా.. నవీ ముంబైలో ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌బీఐ ఇన్నోవేషన్‌ విభాగాధిపతి సిదోన్‌ బరావ్‌కర్‌ తెలిపారు. సుమారు రూ.100 కోట్లతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

దేశీ ఆర్థిక సేవల సంస్థల ఇన్నోవేషన్‌ కేంద్రాలన్నింట్లో ఇదే అతి పెద్దది అవుతుందన్నారు. ‘‘భవిష్యత్‌ అవసరాలను అందిపుచ్చుకునేలా బ్యాంకును సిద్ధం చేసే క్రమంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ బ్లాక్‌ చెయిన్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ తదిరత టెక్నాలజీల కోసం ప్రత్యేకంగా 40 జోన్లుంటాయి’’ అని బరావ్‌కర్‌ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement