కొటక్ మహీంద్రా బ్యాంకులో ఐఎన్‌జీ వైశ్యా విలీనం | Kotak Mahindra bank to acquire ING Vysya bank | Sakshi
Sakshi News home page

కొటక్ మహీంద్రా బ్యాంకులో ఐఎన్‌జీ వైశ్యా విలీనం

Published Fri, Nov 21 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

కొటక్ మహీంద్రా బ్యాంకులో ఐఎన్‌జీ వైశ్యా విలీనం

కొటక్ మహీంద్రా బ్యాంకులో ఐఎన్‌జీ వైశ్యా విలీనం

న్యూఢిల్లీ: పెద్ద ప్రైవేటు రంగ బ్యాంకుల్లో ఒకటైన కొటక్ మహీంద్రా.. మరో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐఎన్‌జీ వైశ్యాను విలీనం చేసుకోనుంది. ఇందుకు బుధవారం పూర్తిస్థాయి షేర్ల మార్పిడి ద్వారా డీల్‌ను కుదుర్చుకుంది. విలీనానికి వాటాల నిష్పత్తిని 725:1000 చొప్పున ఖరారు చేసింది.

డీల్‌లో భాగంగా వాటాదారుల వద్ద ఉన్న రూ. 10 ముఖ విలువగల ప్రతి 1000 ఐఎన్‌జీ వైశ్యా బ్యాం క్ షేర్లను రద్దుచేసి రూ. 5 ముఖ విలువగల 725 కొటక్ మహీంద్రా షేర్లను జారీ చేయనుంది. తద్వారా ఐఎన్‌ఎజీ  వైశ్యాను పూర్తిస్థాయిలో కొటక్ బ్యాంక్ విలీనం చేసుకోనుంది.  విలీనం తర్వాత కొటక్ బ్యాంక్ ప్రైవేటు రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్‌ల తర్వాత 4వ పెద్ద బ్యాంక్‌గా అవతరిస్తుంది.

 మార్కెట్ ముగిశాక...
 గురువారం మార్కెట్ ముగిశాక కొటక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ ఉదయ్ కొటక్ డీల్ వివరాలను వెల్లడించారు. బ్యాంకింగ్ రంగంలో ఉత్తమ ప్రమాణాలను పాటిస్తామని, పారదర్శక పాలనా విధానాలు అవలంబిస్తామని కొటక్ బ్యాంక్ ఈ సందర్బంగా ఒక ప్రకటనలో వివరించింది. విలీనం వల్ల లభించే ప్రయోజనాలను ఉద్యోగులు, కస్టమర్లు, వాటాదారులకు అందించనున్నట్లు తెలి పింది.

విలీనం తరువాత కొటక్ మహీంద్రా బ్రాంచీల సంఖ్య 1,214కు చేరనుండగా, ఐఎన్‌జీ వైశ్యా కనుమరుగుకానుంది. డీల్‌ను రెండు బ్యాంకుల వాటాదారులతోపాటు, ఆర్‌బీఐ, కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) అనుమతించాల్సి ఉంది. కాగా, విలీనం అంచనాలతో బీఎస్‌ఈలో కొటక్ మహీంద్రా బ్యాంక్ షేరు 7.3% ఎగసి రూ. 1,157 వద్ద నిలవగా, ఐఎన్‌జీ వైశ్యా షేరు సైతం 7% జంప్‌చేసి రూ. 814 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రెండు షేర్లూ ఏడాది గరిష్టాలను తాకాయి.

కొటక్ మహీంద్రా గరిష్టంగా రూ. 1,164ను తాకగా, ఐఎన్‌జీ వైశ్యా దాదాపు 14% దూసుకెళ్లి రూ. 865కు చేరింది. నవంబర్ 19తో ముగిసిన నెలరోజుల్లో కొటక్ మహీంద్రా బ్యాంక్ షేరు సగటు ముగింపు ధర ఆధారంగా ఐఎన్‌జీ వైశ్యాబ్యాంక్ షేరును రూ. 790గా విలువకట్టి విలీన నిష్పత్తిని నిర్ణయించారు. కోటక్, ఐఎన్‌జీ వైశ్యాలు వేరువేరుగా నియమించిన వాల్యుయేటింగ్ సంస్థలు ఎస్‌ఆర్ బాట్లిబాయ్, ప్రైస్ వాటర్‌హౌస్‌లు ఈ విలీన నిష్పత్తిని సిఫార్సుచేసాయి.

 విలీనాల చరిత్ర ఇది...
 2008లో అంతర్జాతీయ సంక్షోభం చెలరేగాక లాభాల్లో ఉన్న రెండు బ్యాంకుల మధ్య విలీనం జరగడం ఇదే తొలిసారికాగా, ఇంతక్రితం కూడా పలు బ్యాంకుల మధ్య విలీనాలు జరిగాయి. 2010లో బ్యాంక్ ఆఫ్ రాజస్తాన్... ఐసీఐసీఐలోనూ, ఎస్‌బీఐ అనుబంధ సంస్థలు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండోర్, సౌరాష్ట్రలు ఎస్‌బీఐలోనూ విలీనమయ్యాయి. ఇక 2008లోనే సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సొంతం చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ రాజస్తాన్, సెంచూరియన్ బ్యాంక్‌లు నష్టాల్లో ఉండేవి.

 విలీనం తరువాత...
 కొన్ని మెట్రో నగరాలలో మినహాయిస్తే విలీనం వల్ల దేశవ్యాప్తంగా కొటక్ మహీంద్రా కార్యకలాపాలు విస్తరించనున్నాయి. ఐఎన్‌జీ వైశ్యా శాఖల్లో 66% దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకల్లో విస్తరించగా, కొటక్ మహీంద్రా పశ్చిమ, ఉత్తర భారతంలో విస్తరించింది. విలీన బ్యాంకు 1,214  శాఖ లు, 1,794 ఏటీఎంలను కలిగి ఉంటుంది.
     
చిన్న, మధ్య తరహా సంస్థల(ఎస్‌ఎంఈ) విభాగంపై పట్టుచిక్కుతుంది. ఐఎన్‌జీ వైశ్యా రుణాల్లో ఈ విభాగానికి 38% వాటా ఉంది.
రూ. 2 లక్షల కోట్ల బ్యాలన్స్ షీట్‌తో నాలుగో పెద్ద ప్రైవేట్ బ్యాంకుగా పటిష్టంకానుంది.
విలీన బ్యాంకులో నెదర్లాండ్స్ దిగ్గజం ఐఎన్‌జీ గ్రూప్‌నకు 6.5% వాటా లభిస్తుంది. తద్వారా కొటక్ బ్యాంక్‌లో రెండో పెద్ద వాటాదారుగా నిలుస్తుంది. ప్రస్తుతం ఐఎన్‌జీ వైశ్యాలో ఈ సంస్థ వాటా 42.73%.కొటక్ బ్యాంక్‌లో ప్రమోటర్ ఉదయ్ కొటక్ వాటా ప్రస్తుత 39.71% నుంచి 34%కు తగ్గనుంది. ఆర్‌బీఐ నిబంధనల మేరకు 2016కల్లా 30%కు వాటా పరిమితం చేసుకోనున్నారు.

 కొటక్ మహీంద్రా, ఐఎన్‌జీ వైశ్యా మధ్య విలీన అంశాన్ని ప్రకటించడంలో ఉద్వేగానికి లోనవుతున్నా. వాటాదారులకు అత్యుత్తమ విలువ చేకూర్చే లక్ష్యంతో పనిచేస్తాం.   -ఉదయ్ కొటక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ వైస్‌చైర్మన్

 ఈ డీల్ కుదుర్చుకున్నందుకు ఉదయ్‌ను అభినందిస్తున్నా. ఇది ఓ అద్భుతమైన ముందడుగు.
 - ఆనంద్ మహీంద్రా, మహీంద్రా గ్రూప్ సీఎండీ

 రెండు బ్యాంకులూ సరైన సమయంలో సరైన విధంగా జత కలుస్తున్నాయి. సంయుక్త సంస్థ ద్వారా మా కస్టమర్లకు అద్భుత విలువ చే కూరుతుంది. దేశ, విదేశాలలో మరింతగా విస్తరించేందుకు వీలు చిక్కుతుంది.
 - శైలేంద్ర భండారీ, ఐఎన్‌జీ వైశ్యా ఎండీ

 84 ఏళ్ల మా బ్యాంకింగ్ ప్రస్థానంలో చరిత్రాత్మకమైన రోజు. జాతీయ సంస్థగా ఎదిగేందుకు తోడ్పడుతుంది.
 - ఉదయ్ శరీన్, ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ కాబోయే సీఈఓ కొటక్ మహీంద్రా బ్యాంక్  

 ఎప్పుడు ఏర్పాటైంది:    2004
 మార్కెట్ విలువ:       రూ.89,252 కోట్లు
 శాఖలు:                  641
 ఏటీఎంలు:                1103
 ప్రమోటర్ వాటా:        40.07%
 పబ్లిక్ వాటా:            56.26%
 మొత్తం ఆస్తులు:      రూ.1,22,237 కోట్లు
 2013-14 ఏడాదికి
 మొత్తం ఆదాయం:    రూ. 10,167 కోట్లు
 నికర లాభం:               రూ. 1,503 కోట్లు
 షేరు ఏడాది గరిష్టం:    రూ. 1,164
 షేరు ఏడాది కనిష్టం:    రూ. 631
 ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్
 మార్కెట్ విలువ:             రూ. 15,513 కోట్లు
 శాఖలు:                          573
 విదేశీ ప్రమోటర్ల వాటా:      42.73%
 పబ్లిక్ వాటా:                   57.27%
 2013-14
 మొత్తం ఆదాయం:    రూ. 6,072 కోట్లు
 నికర లాభం:              రూ. 658 కోట్లు
 షేరు ఏడాది గరిష్టం:     రూ. 865
 షేరు ఏడాది కనిష్టం:    రూ. 493

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement