ఐటీ ఉద్యోగులపై కాస్ట్‌ కటింగ్‌ కత్తి | layoffs: Is Bengaluru being Bangalored? Layoffs, job loss fears leave techies reeling under uncertainty | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగులపై కాస్ట్‌ కటింగ్‌ కత్తి

Published Sat, Aug 5 2017 8:44 AM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM

ఐటీ ఉద్యోగులపై కాస్ట్‌ కటింగ్‌ కత్తి - Sakshi

ఐటీ ఉద్యోగులపై కాస్ట్‌ కటింగ్‌ కత్తి

► తక్కువ రేటింగ్‌ ఇస్తూ ఉద్యోగులపై వేటు
► భారీ ఎత్తున ఉద్యోగాల కోత
► ఐటీ ఉద్యోగుల్లో ఆందోళనలు

బెంగళూరు: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌... ఐదంకెల వేతనం, వారంలో రెండు రోజుల సెలవు, పిక్‌ అండ్‌ డ్రాప్‌ సౌకర్యం వెరసి హ్యాపీ లైఫ్‌. కాని ఇప్పుడు పరిస్థితి తారుమారవుతోంది. సాఫ్ట్‌వేర్‌ రంగం సంక్షోభం రోజు రోజుకు ముదురుతోంది. దిగ్గజ ఐటీ కంపెనీలు సైతం నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. విస్తృతంగా పెరిగిన ఆటోమేషన్‌తో పాటు ఆర్థిక సంక్షోభం కారణంగా వరుస నష్టాలు ఎదురుకావడంతో ఐటీ రంగం తన ప్రభను కోల్పోతోంది. సౌలభ్యాలలో కోతలు విధించడంతో పాటు నైపుణ్యత లేదంటూ ఉద్యోగులను తొలగిస్తూ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు ఐటీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.

ఉద్యోగుల్లో అలజడి : ఐటీ కంపెనీల తీరుతో ఉద్యోగుల్లో అలజడి నెలకొంది. ప్రత్యామ్నాయ అవకాశాలు లేని సమయంలో వేటు వేస్తే కుటుంబాలు రోడ్లమీద పడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ సహచరులు ఉద్యోగాలను కోల్పోతుండటంతో మిగిలిన ఉద్యోగుల్లో భయం పట్టుకుంది. గతంలో ఎంతో లగ్జరీగా బతికిన ఈ ఐటీ కుటుంబాలు ప్రతి రూపాయి లెక్క వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు మానసిక ఒత్తిళ్లు, బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లిస్తామా లేదా అనే భయం వారిని పట్టుకుంది.

బెంగళూరుకు చెందిన మనోహర్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌లో బంగారు పతకం సాధించారు. దీంతో ప్రాంగణ ఎంపికలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మనోహర్‌ను ఐదంకెల జీతంతో ఉద్యోగంలోకి తీసుకుంది. అలా ఐదు సంవత్సరాలుగా అదే కంపెనీలో పని చేస్తున్న మనోహర్‌ ప్రస్తుతం ఉన్నత స్థానానికి చేరుకున్నారు. లక్షల్లో వచ్చే జీతంతో సోదరి వివాహం చేసి తమ్ముడిని కూడా తానే చదివిస్తున్నారు. ఇటీవల ఓ యువతితో ఆగస్ట్‌లో వివాహం కూడా నిశ్చయించుకున్నారు. అయితే సాఫ్ట్‌వేర్‌ రంగంలో సంక్షోభం తలెత్తడంతో ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కేందుకు సదరు కంపెనీ మనోహర్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. దీంతో మనోహర్‌ వివాహాన్ని కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక్క మనోహర్‌కి మాత్రమే పరిమితం కాలేదు. ఇటీవల ఇటువంటి సంఘటనలు కొకొల్లలు.

ఆర్థిక పరిస్థితిని అదుపు చేయడానికి కాస్ట్‌ కటింగ్‌ పేరుతో ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సౌలభ్యాలలో కోతలు విధించడంతో పాటు నైపుణ్యత లేదంటూ ఉద్యోగులను తొలగిస్తూ ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు  ఐటీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. పనితీరు సరిగా లేదంటూ (లే ఆఫ్‌) ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఫైర్‌ ఎగ్జిట్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారికి మరే కంపెనీల్లోను ఉ ద్యోగాలు లభించవని తమ జీవితాలు నాశనమవుతున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగాలను తొలగించే సమయంలో కనీసం కార్మిక నిబంధనలు పాటించడం లేదని అంటున్నారు. 12 నుంచి 17 గంటల పాటు పని చేయిస్తున్నారని ఇదేమని ప్రశ్నిస్తే ఉద్యోగాల్లో తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాయంటూ ఉద్యోగులు వాపోతున్నారు. తొలగించడానికి మూడు నెలల ముందే ఉద్యోగికి సమాచారం ఇవ్వాల్సి ఉన్నా అవేమి పాటించట్లేదని కనీసం మూడు నెలల జీతం ఇవ్వమని ఉద్యోగులు చేస్తున్న విన్నపాన్ని కూడా కంపెనీలు పట్టించుకోవట్లేదంటూ ఆరోపిస్తున్నారు.   

బెంగళూరు విషయమే తీసుకుంటే...
ఇండియన్‌ సిలికాన్‌ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరుకు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఈ లే ఆఫ్‌ బెడద ఎక్కువగా ఉంటోంది. ఒక్క బెంగళూరులు నగరంలోనే దాదాపు 1850 ఐటీ, ఐటీ ఆధారిత సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 12 లక్షల మంది ఉద్యోగులు (డాటా ఎంట్రీ ఉద్యోగులు మొదలుకొని డిప్యూటీ సంస్థ బిజినెస్‌ హెడ్‌ వరకూ) ఉన్నట్లు వైఎస్సార్‌ సీపీ ఐటీ వింగ్‌ జనరల్‌ సెక్రెటరీ శ్యామ్‌రెడ్డి చెబుతున్నారు. ఐదు నెలల కాలంలో ఒక్క బెంగళూరులోనే ఈ లేఆఫ్‌ వల్ల దేశ వ్యాప్తంగా దాదాపు లక్ష మంది తమ ఉద్యోగాలను పోగొట్టుకోగా అందులో 35 వేల మంది బెంగళూరుకు చెందిన సంస్థల్లో పనిచేస్తున్నవారేనని  ఆయన పేర్కొన్నారు.

ఇక ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్షుడు కుమారస్వామి మాట్లాడుతూ...లే ఆఫ్‌ విషయంలో ఐటీ సంస్థల అధినేతలు కనీసం మానవీయ కోణంలో ఆలోచించడం లేదని వాపోయారు. ఒక్కసారిగా ఉద్యోగంలో నుంచి తీసివేయడం వల్ల సామాజికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. కనీసం మూడు నెలల ముందుగా నోటీసు ఇచ్చి ఆరునెలల జీతాన్ని ఇవ్వాల్సిందిగా ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు శనివారం ఆయన సంస్థ తరఫున రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్‌ఖర్గేను కలిసి వినతి పత్రం అందజేశారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement