రుణ డిమాండ్ పెరిగితేనే వడ్డీ రేట్లు తగ్గుతాయ్
ముంబై: రుణాలకు డిమాండ్ పెరిగితేనే వడ్డీ రేట్లు మరింత తగ్గించే అవకాశం ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య తెలిపారు. రుణాలకు పెద్దగా డిమాండ్ లేనప్పుడు వడ్డీ రేట్లను ఎకాయెకీన తగ్గించేస్తే బ్యాంకులకు వచ్చే ఆదాయమూ తగ్గిపోతుందని ఆమె చెప్పారు. అలాంటప్పుడు డిపాజిట్లపై అధిక వడ్డీని చెల్లించగలిగేందుకు సరిపడేంత ఆదాయాన్ని పొందేందుకు ఇతర మార్గాలు వెతుక్కోవాల్సి వస్తుందన్నారు.
అదే భారీ ఎత్తున రుణాలకు డిమాండ్ పెరిగితే, వడ్డీ ఆదాయ పరిమాణమూ పెరుగుతుంది కనుక దాని ఆధారంగా రేట్లను తగ్గించే అవకాశాలు ఉంటాయని అరుంధతి వివరించారు. తయారీ రంగ పురోగతిని సూచించే ఎస్‌బీఐ కాంపోజిట్ ఇండెక్స్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. డిపాజిట్ రేట్లు అధిక స్థాయిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం బ్యాంకులకు కష్టతరమవుతుందన్నారు. మరోవైపు సమస్యల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తున్న స్పైస్‌జెట్ విమానయాన సంస్థకు తామెటువంటి రుణాలు ఇవ్వలేదని ఆమె చెప్పారు.