లగ్జరీ కార్ల అమ్మకాల జోరు!
దేశంలో లగ్జరీ కార్ల మార్కెట్ జోరుగా ఉంది. కార్ల కంపెనీల మధ్య పోటీ పెరగడం, సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ విస్తరిస్తుండటంతో లగ్జరీ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2013-2014)లో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 6 శాతం తగ్గాయి. అదే సమయంలో లగ్జరీ కార్ల అమ్మకాలు 25 శాతం పెరిగి, 35 వేల యూనిట్లకు పెరిగాయి. అదే సమయంలో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్ల మార్కెట్ 60 శాతం పెరిగి 30 వేల యూనిట్లకు చేరింది. సాధారణంగా ప్రతి రెండు మూడేళ్లలో లగ్జరీ కార్లను వాటి యజమానులు మార్చేస్తున్నారు. ఈ కారణంగా యూజ్డ్ కార్ల మార్కెట్ విస్తృతి పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ప్రథమార్ధంలో మెర్సిడెజ్-బెంజ్ యూజ్‌డ్ కార్ల అమ్మకాలు 42 శాతం పెరిగాయి. గడిచిన కొన్ని సంవత్సరాలుగా యూజ్‌డ్ లగ్జరీ కార్ల మార్కెట్ సగటున 25 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వస్తోంది. బిఎండబ్లూ 3 సిరీస్ కారు కొత్తది 34 లక్షల రూపాయలు కాగా, సెకండ్ హ్యాండ్ ధర 22 లక్షల రూపాయలుగా ఉంది. కారు వయసు పెరిగే కొద్దీ ధర మరింతగా తగ్గుతుంది.
ప్రస్తుతం మన దేశంలో బెంజ్, బిఎండబ్లూ, ఆడి కార్లు ప్రధానంగా లగ్జరీ కారు బ్రాండ్లుగా ఉన్నాయి. వీటికి పోటీగా టయోటా లెక్సస్, నిస్సాన్ ఇన్ఫినిటీ, జనరల్ మోటార్స్ క్యాడిల్లాక్ కంపెనీలు కూడా ఇండియన్ మార్కెట్ మీద దృష్టి పెట్టాయి. మార్కెట్ విస్తృతి పెరిగే కొద్దీ కొత్త కంపెనీలు రంగంలోకి రావడం సహజం. ఈ పోటీని తట్టుకునేందుకు ఇప్పటికే ఉన్న కంపెనీలు తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్ ఉండే లగ్జరీ కార్లను రంగంలోకి దించుతున్నాయి. మొత్తం మీద కుబేరులు, కోట్ల రూపాయల వేతనాలందుకునే ఎగ్జిక్యూటివ్‌లతోపాటు ఓ మాదిరి ధనవంతులు కూడా ఇప్పుడు లగ్జరీ కార్లు కొనుగోలు చేసే అవకాశం ఏర్పడుతోంది.
**