మన వాళ్లు రూ.2 కోట్ల వాచీనీ కొనేస్తున్నారు..!
లగ్జరీ కార్లకు ఏమాత్రం తీసిపోకుండా ఇప్పుడు ఖరీదైన వాచీలూ భారత్‌లో దర్శనమిస్తున్నాయి. ఒమెగా, బుల్గారీ, పియాజెట్, బ్రుగీ, ఉర్విక్.. ఇలా కంపెనీ ఏదైతేనేం. లిమిటెడ్ ఎడిషన్ అయితే చాలు భారత్‌లో రూ.2 కోట్ల వరకూ వెచ్చించే సంపన్నులూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వజ్రాలు పొదిగిన, ప్లాటినం, బంగారంతో తయారైన ఈ ఖరీదైన వాచీలను ఇష్టపడని వారుండరు. అయితే వీటి అమ్మకాలే వాచీలో ముల్లుల్లాగా సెలైంట్‌గా జరుగుతున్నాయి. విక్రయించిన కంపెనీగానీ, కొనుక్కున్న కస్టమర్ గానీ ఈ విషయాన్ని వెల్లడించడానికి ఇష్టపడడం లేదు. రూ.10 లక్షలు, ఆపైన ఖరీదు చేసే ‘ప్రెస్టీజ్’ వాచీలు భారత్‌లో ఏటా 300లపెనే అమ్ముడు అవుతున్నాయంటే ఆశ్చర్యం వేయకమానదు.
ఇదీ వాచీల విపణి..
దేశవ్యాప్తంగా వ్యవస్థీకత రంగంలో వాచీల విక్రయ పరిమాణం రూ.6,000 కోట్లుంది. అవ్యవస్థీకత రంగంలోనూ ఇదే స్థాయిలో వ్యాపారం జరుగుతోంది. అయితే, ప్రతి వంద మందిలో ముగ్గురికి మాత్రమే వాచీ ఉంటోంది. అదే ప్రపంచంలో ఇది 25 శాతం దాకా ఉంది.
అంతస్తును ప్రదర్శించుకునేందుకు..
రూ.10 లక్షలు ఆపైన ధరలో ఉండే వాచీలను ప్రెస్టీజ్ విభాగం కింద పరిగణిస్తున్నారు. ఈ విభాగంలో ఏటా దేశంలో 300 వాచీలు అమ్ముడవుతున్నాయట. లిమిటెడ్ ఎడిషన్లలో చేతితో చేసిన ఒక్కో వాచీ తయారీకి ఆరు నెలల పైన సమయం పడుతోంది. మొత్తం వాచీల అమ్మకాల్లో టాప్-30 నగరాల వాటా 80 శాతముంది.
కలర్‌ఫుల్ కాపర్..
రాగి (కాపర్) వర్ణంతో తయారైన వాచీలను ధరించేందుకు మహిళలు మక్కువ చూపుతున్నారు. ఆ తర్వాత వైన్ వర్ణం, తెలుపు రంగుల వాచీలకు గిరాకీ ఎక్కువ. మగ వారి విషయంలో స్టీలు, రోజ్ గోల్డ్ కలర్స్‌కు క్రేజ్ ఉంది. వ్యాపారులైతే చేతికి రోజ్ గోల్డ్ కలర్ వాచీ ఉండాల్సిందేనంటున్నారు. దక్షిణాదిన ఈ రంగు వాచీలకు మంచి ఆదరణ ఉంది. మూడేళ్ల క్రితం వరకు అమ్ముడైన వాచీల్లో పురుషులు ధరించేవి 90 శాతం, స్త్రీలవి 10 శాతం ఉండేవి. ఇప్పుడు స్త్రీల వాచీల వాటా 30 శాతానికి ఎగసింది.
డిస్కౌంట్లు కోరరు..
వాచీల విషయంలో హైదరాబాద్ కస్టమర్లు హుందాగా వ్యవహరిస్తారట. బ్రాండ్, విలువకే తొలి ప్రాధాన్యమిస్తారని జస్ట్ లైఫ్‌సై ్టల్ బ్రాండ్ మేనేజర్ మనోజ్ సుబ్రమణియన్ అంటున్నారు.