
మాల్యా ఉద్దేశపూర్వకంగానే ఆస్తుల వివరాలు తెలపట్లేదు
సుప్రీంకోర్టు ముందు బ్యాంకుల వాదన
న్యూఢిల్లీ: అప్పుల భారంతో దేశం వీడి బ్రిటన్‌లో నివసిస్తున్న బ్యాంకింగ్ ఎగవేతదారు, పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా ఉద్దేశపూర్వకంగానే తన ఆస్తుల వివరాలు వెల్లడించడంలేదని ఎస్‌బీఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సా ర్షియం సుప్రీంకోర్టుకు తెలిపింది. బ్రిటిష్ సంస్థ డియాజియో నుంచి ఫిబ్రవరిలో 40 మిలియన్ డాలర్లు తీసుకున్న విషయాన్నీ ఆయన వెల్లడించలేదని పేర్కొన్నాయి. బ్యాంకుల తరఫున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్నిత్క్ ధర్మాసనానికి తన వాదనలు వినిపిస్తూ... సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మాల్యా కోర్టుకు హాజరుకావాలని, అలా ఆయన నడుచుకోకపోవడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్నారు.
మాల్యా ఆస్తుల వివరాల్లో పలు అవాస్తవాలూ ఉన్నాయన్నారు. కాగా మాల్యా కోర్టు హాజరు నోటీసుకు సంబంధించి రీకాల్ పిటిషన్ వేశామని మాల్యా తరఫున లాయర్ సీఎస్ వైద్యనాథన్ తెలిపారు. ఇది కోర్టు ధిక్కరణ పరిధిలోనికి రాదని స్పష్టం చేశారు. కాగా రీకాల్ పిటిషన్‌పై బ్యాంకులు తమ స్పందన పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు, కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 27కు వాయిదా వేసింది.