జనవరి నుంచి మారుతీ కార్లు ప్రియం
రూ.20,000 వరకూ పెంపు
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ తన కార్ల ధరలను వచ్చే నెల నుంచి రూ.20,000 వరకూ పెంచుతోంది. నిర్వహణ, ఇతర వ్యయాలు పెరుగుతుండడం, రూపాయి క్షీణత వంటి కారణాల వల్ల ధరలు పెంచక తప్పడం లేదని మారుతీ సుజుకీ తెలిపింది. రూ.2.53 లక్షల ఖరీదున్న ఆల్టో 800 నుంచి రూ.13.74 లక్షల ఖరీదున్న ఎస్-క్రాస్ వరకూ వివిధ మోడళ్లను మారుతీ సుజుకీ విక్రయిస్తోంది. వ్యయాలు పెరుగుతున్నాయంటూ పలు కార్ల కంపెనీలు కార్ల ధరలను జనవరి నుంచి పెంచుతున్నాయి.
టయోటా, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ తదితర కంపెనీలు ధరలను పెంచనున్నాయి. ఇక అన్ని మోడళ్ల ధరలను రూ.30,000 వరకూ పెంచుతున్నట్లు హ్యుందాయ్ కంపెనీ బుధవారమే వెల్లడించింది. ఈ కంపెనీ రూ.3.10 లక్షల ఖరీదుండే ఇయాన్ మోడల్ నుంచి రూ.30.41 లక్షల ఖరీదుండే శాంటాఫే కార్ల వరకూ మొత్తం 9 మోడళ్లను విక్రయిస్తోంది. ధరలు పెంచతున్నామని ప్రకటించడం ద్వారా పండుగ సీజన్‌లో ఇచ్చిన డిస్కౌంట్లతో సంవత్సరాంతంలో అమ్మకాలు పెంచుకోవడానికి కంపెనీలు ఈ వ్యూహాన్ని అనుస రిస్తాయని నిపుణులంటున్నారు.