
డ్రైవర్ల శిక్షణకు మారుతీ, ఓలా భాగస్వామ్యం
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన కంపెనీ ‘మారుతీ సుజుకీ’ తాజాగా ట్యాక్సీ అగ్రిగేటర్ ‘ఓలా’తో జతకట్టింది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కూడా కుదిరింది. తాజా ఒప్పదంలో భాగంగా ‘మారుతీ ఓలా ట్రైనింగ్ ప్రోగ్రామ్’ను ప్రారంభిస్తామని, దీని ద్వారా మూడేళ్లలో 40,000 మంది డ్రైవర్లకు శిక్షణనిస్తామని మారుతీ సుజుకీ తెలిపింది. ఔత్సాహికులు తాజా కార్యక్రమం ద్వారా ఎంట్రప్రెన్యూర్‌షిప్ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అభిప్రాయపడింది.
‘మారుతీ ఓలా ట్రైనింగ్ ప్రోగ్రామ్’ను తొలిగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ప్రారంభిస్తామని పేర్కొంది. కాగా మారుతీ సుజుకీ తన డ్రైవింగ్ స్కూళ్ల ద్వారా అభ్యర్థులకు డ్రైవింగ్ శిక్షణనివ్వడంతోపాటు లెసైన్‌స ఇప్పించడంలోనూ, వాహన కొనుగోలుకు రుణాన్ని అందించడంలోనూ సాయమందిస్తుంది. ఇక ఓలా ఈ శిక్షణ పొందిన డ్రైవర్లకు ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. శిక్షణ కాలం నెల రోజులు ఉంటుంది.