న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకీకి గడిచిన రెండేళ్లలో మొదటిసారి నికర లాభాలను పడిపోయాయి. నేడు(మంగళవారం) ప్రకటించిన నాలుగో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నికర లాభాలు 12 శాతం పడిపోయి, రూ.1,130 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే క్వార్టర్లో రూ.1,284 కోట్ల నికర లాభాలను కంపెనీ ఆర్జించింది. కంపెనీకి ఖర్చులు అపరిమితంగా పెరగడం, ఫ్యాక్టరీలో నెలకొన్న పౌర అశాంతితో ఉత్పత్తి నష్టాలను ఎక్కువగా నమోదుచేయడం ఈ ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
అయితే కంపెనీ నికర అమ్మకాలు ఈ ఏడాది మెరుగ్గానే ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. 15.27 శాతం వృద్ధి కనిపించిన నికర అమ్మకాలు రూ. 15,300 కోట్లగా నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ అమ్మకాలు రూ.13,273 కోట్లగా ఉన్నాయి. గతేడాది కంటే మెరుగైన అమ్మకాలను మారుతి సుజుకీ చూపించడంతో, కంపెనీ ఒక్క షేరుకు రూ.35 డివిడెంట్ ప్రకటించింది. దీంతో స్టాక్ మార్కెట్లో మారుతీ సుజుకీ షేర్లు లాభాలను పుంజుకున్నాయి. ఈ షేరు 3.96 శాతం పెరిగి 147.75 వద్ద నమోదయ్యాయి. నేడు(మంగళవారం) మార్కెట్లను లీడ్ చేసిన కంపెనీలో మారుతి సుజుకీ ఉండటం విశేషం.