మారుతీ కొత్త డిజైర్ వచ్చేస్తోంది..
మే 16న మార్కెట్‌లోకి
న్యూఢిల్లీ: దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’ తాజాగా తన ప్రముఖ కాంపాక్ట్ సెడాన్ కారు ‘డిజైర్’లో మూడవ జనరేషన్‌ను ఆవిష్కరించింది. ఈ సరికొత్త డిజైర్ కార్లు మే 16న మార్కెట్‌లోకి రానున్నవి. వీటి ద్వారా కంపెనీ కాంపాక్ట్ సెడాన్ విభాగంలో మళ్లీ వృద్ధిని నమోదుచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2015–16 ఆర్థిక సంవత్సరంలో 4,40,735 యూనిట్లుగా ఉన్న కాంపాక్ట్ సెడాన్ విభాగపు కార్ల విక్రయాలు 2016–17 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం తగ్గుదలతో 4,02,608 యూనిట్లకు క్షీణించాయి. ఇదే సమయంలో మారుతీ డిజైర్ అమ్మకాలు 15 శాతం క్షీణతతో 2,34,242 యూనిట్ల నుంచి 1,99,878 యూనిట్లకు తగ్గాయి. ఒకవైపు విక్రయాలు తగ్గినప్పటికీ కాంపాక్ట్ సెడాన్ విభాగపు అమ్మకాల్లో డిజైర్ 50 శాతం వాటాను ఆక్రమించింది.
ఏజీఎస్ ఫీచర్‌తో రానున్న కొత్త డిజైర్ వెర్షన్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ అనే రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్ల అందుబాటులో ఉంటుందని మారుతీ సుజుకీ పేర్కొంది. కాగా కంపెనీ ఇప్పటిదాకా 13.81 లక్షల యూనిట్ల డిజైర్ కార్లను విక్రయించింది. మారుతీ సుజుకీ తన డిజైర్ మోడల్‌ను 2008 మార్చిలో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. డిజైర్‌కు పోటీగా ఇటీవలే హ్యుందాయ్ మోటార్స్ ఇండియా తన ఎక్సెంట్‌లో కొత్త అప్‌గ్రేడ్ వెర్షన్ ఆవిష్కరించింది. అలాగే టాటా మోటార్స్ కూడా టిగోర్‌ను తీసుకువచ్చింది. ఇవే కాక డిజైర్ మోడల్ హోండా అమేజ్, ఫోర్డ్ యాస్పైర్, ఫోక్స్‌వ్యాటన్ అమియో వంటి వాహనాల నుంచి పోటీ ఎదుర్కోనుంది.