
న్యూఢిల్లీ: జీఎస్‌టీ వసూళ్లు మెరుగుపడితే 12, 18% జీఎస్‌టీ ట్యాక్స్ శ్లాబులను విలీనం చేసే అవకాశాలున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంకేతాలిచ్చారు. 28 శాతం ట్యాక్స్ శ్లాబు వర్తించే వస్తువుల సంఖ్యను తగ్గిస్తామని తెలియజేశారు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్‌టీలో ప్రస్తుతం ట్యాక్స్ శ్లాబ్‌లు 5, 12, 18, 28%గా ఉన్న విషయం తెలిసిందే. ఒకే రకమైన జనాభా ఉన్న దేశంలోనే ఒకే ట్యాక్స్ రేటు జీఎస్‌టీ సాధ్యమని, భారత్‌లాంటి దేశంలో దానిని అమలు చేయలేమని స్పష్టం చేశారాయన. ఇక్కడ జరిగిన హెచ్‌టీ లీడర్‌షిప్ సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్న, మధ్య తరహా సంస్థలకు జీఎస్‌టీ రిటర్న్‌లు దాఖలు చేయడం ఒకింత భారంగానే ఉందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
సంస్కరణలు కొనసాగుతాయ్...
గత మూడేళ్లలో భారత్ 7– 8 శాతం చొప్పున వృద్ధి సాధించిందని, 10 శాతం వృద్ధి సాధించడం కష్టసాధ్యమైన పనేనని అరుణ్ జైట్లీ అంగీకరించారు. అయితే సంస్కరణల విషయంలో వెనకడుగు వేసేది లేదన్నారు. ‘‘సంస్కరణలకు అంతం లేదు. ఇవి కొనసాగుతూనే ఉంటాయి’’ అని భరోసానిచ్చారు.
ప్రమోటర్లూ బిడ్ చేయవచ్చు...
బ్యాంక్‌లు తమ మొండిబకాయిల వసూళ్ల కోసం కంపెనీల ఆస్తులను వేలం వేసినప్పుడు ప్రమోటర్లు కూడా ఆ వేలంలో పాల్గొనవచ్చని ఆర్థిక మంత్రి చెప్పారు. కాకపోతే సదరు ప్రమోటర్లు మొండి బకాయిలు చెల్లిస్తేనే, వారి కంపెనీల ఆస్తుల వేలానికి సంబంధించి బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. రుణాలపై వడ్డీలు కూడా చెల్లించని ప్రమోటర్లపై మాత్రం నిషేధం ఉంటుందని వెల్లడించారు. మొండి బకాయిల వసూళ్లకు బ్యాంక్‌లు ఆయా కంపెనీల ఆస్తులను వేలం వేసినప్పుడు ప్రమోటర్లు కూడా పాల్గొనే ప్రయత్నాలు చేస్తుండటంతో ఆర్థిక మంత్రి తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఐదేళ్లలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు..
సూక్ష్మ ఆర్థిక అంశాలు మెరుగుపడటంతో భారత్ 7– 8 శాతం వృద్ధి సాధించగలదని జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. ‘‘తొలుత మనం మధ్య రకం ఆదాయ దేశంగా ఎదగాలి. ఆ తర్వాత అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలుగుతాం. దీనికోసం ఇరవై ఏళ్లలో మనకు మౌలిక రంగంలో భారీగా పెట్టుబడులు అవసరం. అదే వచ్చే ఐదేళ్లను తీసుకుంటే మౌలిక రంగానికి కనీసం రూ. 50 లక్షల కోట్ల పెట్టుబడులు కావాలి’’ అని 5వ వార్షిక డిఫెన్స్ ఎస్టేట్స్ డే కార్యక్రమంలో చెప్పారాయన. 2007–17 కాలానికి మౌలిక రంగంపై భారత్ రూ.60 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టిందన్నారు. రెండంకెల ద్రవ్యోల్బణ స్థితిగతులను అధిగమించామని, ద్రవ్యో ల్బణం 4%లోపే ఉండాలన్న, కరెంట్ అకౌంట్ లోటు నియంత్రణలోనే ఉంచాలన్న లక్ష్యాలను విజయవంతగా సాధించామని చెప్పారు. గ్రామాల్లో కూడా మౌలికరంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.