చైనా మార్కెట్ లోకి మైక్రోమ్యాక్స్
న్యూఢిల్లీ : భారత అతిపెద్ద హ్యాండ్ సెట్ల తయారీదారి మైక్రోమ్యాక్స్, చైనా మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఈ పోటీతత్వ ప్రపంచంలో 2020లోపు నెంబర్.5 స్థానాన్ని సొంతంచేసుకోవడమే లక్ష్యంగా వచ్చే ఏడాది చైనా మార్కెట్లోకి ప్రవేశించాలని మైక్రోమ్యాక్స్ యోచిస్తోంది. సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పబ్లిక్ లిస్టింగ్ ద్వారా కంపెనీ నగదును పెంచుకోనుందని కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. భారత్ లో స్మార్ట్ ఫోన్ కంపెనీల్లో నెంబర్.2 స్థానంగా ఉన్న మైక్రోమ్యాక్స్, అతిపెద్ద మార్కెట్లోకి ప్రవేశించనంత కాలం ప్రపంచంలో నెంబర్.5 క్లబ్ లోకి చేరలేమని మైక్రోమ్యాక్స్ ఇన్ ఫర్ మాటిక్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన వికాస్ జైన్ చెప్పారు. త్వరలోనే చైనాలోకి అరంగేట్రం చేసి మైక్రోమ్యాక్స్ లను అక్కడ కూడా ఆవిష్కరిస్తామని హాంకాంగ్ లోని రైజ్ కాన్ఫరెన్స్ లో జైన్ వెల్లడించారు.
స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో టాప్ కంపెనీలుగా ఉన్న శామ్ సంగ్, యాపిల్ లు చైనాలో మార్కెట్లో దూసుకుపోతూ.. అక్కడి స్థానిక కంపెనీలకు పోటీగా నిలుస్తున్నాయన్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన మైక్రోమ్యాక్స్ , రష్యాలో టాప్.3 స్థానంలో దూసుకుపోతోంది. చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీలు లెనోవా, వివో, ఓప్పో, షియోమి లు కూడా భారత్ లో మైక్రోమ్యాక్స్ కు గట్టి పోటీని ఇస్తున్నాయి. చైనా మార్కెట్ దాదాపు 8000లక్షల స్మార్ట్ ఫోన్లను కలిగి ఉంది. దీనిలో 31శాతం గ్లోబల్ వాల్యుమ్స్ ఆక్రమించుకున్నాయి. ఈ పోటీని తట్టుకుని, మైక్రోమ్యాక్స్ చైనాలో మార్కెట్ ను బలపర్చుకోవాల్సి ఉంది.