స్టార్టప్‌లకు మైక్రోసాఫ్ట్ దన్ను..
సంస్థ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడి
జస్ట్‌డయల్, పేటీఎం, స్నాప్‌డీల్‌తో ఒప్పందం
ముంబై: భారత్‌లో స్మార్ట్ సిటీల రూపకల్పనలో నిమగ్నమైన వందల కొద్దీ స్టార్టప్ సంస్థలకు, ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలకు తోడ్పాటు ఇవ్వనున్నట్లు సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. ఇక్కడి స్టార్టప్ సంస్కృతి తనను అబ్బురపరుస్తోందన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన స్థానిక మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలు, నూతన డివైజ్‌లు.. అపార వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఎంట్రప్రెన్యూర్లకి ఉపయోగపడగలవని ఆయన తెలిపారు. భారత్‌లో తొలిసారిగా మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున నిర్వహించిన క స్టమర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల ఈ విషయాలు వివరించారు. భారత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌కి ప్రాధాన్యం పెరుగుతున్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని నాదెళ్ల చెప్పారు. ఈ నేపథ్యంలోనే పుణే, ముంబై, చెన్నైలలో మైక్రోసాఫ్ట్ మూడు డేటా సెంటర్లు ప్రారంభించిందని పేర్కొన్నారు. మరోవైపు, ఈ-కామర్స్ సంస్థలు జస్ట్‌డయల్, పేటీఎం, స్నాప్‌డీల్ సంస్థలతో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
వ్యాల్యుయేషన్ల గురించి ఆందోళన లేదు..
స్టార్టప్ సంస్థల్లో తాము ఇన్వెస్టర్లుగా ఉండబోవడం లేదు కాబట్టి.. వాటి వ్యాల్యుయేషన్ల గురించి పెద్దగా ఆలోచించడం లేదని నాదెళ్ల చెప్పారు. ఆయా ఆవిష్కర్తల అబ్బురపరిచే ఐడియాలపైనే తాము ఆసక్తిగా ఉన్నామని ఆయన వివరించారు. స్టార్టప్ ఎంట్రప్రెన్యూర్లు కొంగొత్త ఆవిష్కరణలు చేసేందుకు దాదాపు రూ.80 లక్షల విలువైన అజూర్ కంప్యూటింగ్ సొల్యూషన్స్‌ను అందిస్తామని నాదెళ్ల పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల ఏర్పాటుకు తోడ్పడే డిజిటల్ ప్రాజెక్టులను నిర్వహిస్తామన్నారు. తాము చేపట్టిన కార్యక్రమాల ప్రభావం వచ్చే ఐదేళ్లలో 50 స్మార్ట్ సిటీలపై కనిపించగలవని నాదెళ్ల చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో పైలట్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని తెలిపారు.
కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు: సెర్చి ఇంజిన్ బింగ్, క్లౌడ్ ఆధారిత అనలిటిక్స్ తోడ్పాటుతో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్, జస్ట్‌డయల్ కలిసి పనిచేయనున్నాయి. కస్టమర్లు మొబైల్ లావాదేవీలు సులువుగా నిర్వహించుకునేందుకు, బిల్లులను సులభతరంగా ఆన్‌లైన్‌లోనే చెల్లించే వీలు కల్పించేందుకు కోర్టానా బ్రౌజర్‌తో పేటీఎం యాప్, పేటీఎం వాలెట్‌ను అనుసంధానం చేసే అంశంపై పేటీఎం, మైక్రోసాఫ్ట్ చేతులు కలిపాయి. ఈ డీల్‌లో భాగంగా పేటీఎం తమ నెట్‌వర్క్ ద్వారా మైక్రోసాఫ్ట్ సర్వీస్ సేల్స్‌కు తోడ్పాటునివ్వనుంది. అటు ఆన్‌లైన్లో వాహనాల విక్రయానికి తోడ్పడేలా రూపొందిస్తున్న వ్యవస్థ కోసం స్నాప్‌డీల్.. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్‌ఫాంను ఉపయోగించుకోనుంది.
పాస్‌వర్డ్హ్రిత ప్రపంచంపై కసరత్తు ..
ఈమెయిల్స్, మొబైల్ ఫోన్స్ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లకు పాస్‌వర్డ్ కష్టాల నుంచి విముక్తి కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు నాదెళ్ల తెలిపారు. పాస్‌వర్డ్‌లు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రసక్తి లేకుండా కంప్యూటింగ్ పరికరాలకు రక్షణ కల్పించాలన్నది తమ ఉద్దేశమన్నారు. ప్రపంచం, టెక్నాలజీలు మారిపోతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఉత్పాదకత ను, వ్యాపార ప్రక్రియలను మెరుగుపర్చుకోవాలన్నది తమ కంపెనీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా ఉపయోగించే సాధనాల గురించీ నాదెళ్ల ప్రస్తావించారు. ‘నేను మా కంపెనీ తయారు చేసే హైఎండ్ లూమియాతో పాటు ఐఫోన్ నూ వాడతా ను. అయితే, దీన్ని ఐఫోన్ ప్రోగా భావిస్తా. ఎందుకంటే ఇందు లో మా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ మొత్తం ఉంటుంది’ అని సత్య చెప్పారు.
జనవరిలో సర్ఫేస్ ప్రో 4..
వచ్చే ఏడాది జనవరిలో సర్ఫేస్ ప్రో 4 ట్యాబ్లెట్‌ను భారత్‌లో ఆవిష్కరించనున్నట్లు నాదెళ్ల తెలిపారు. 12.3 అంగుళాల పిక్సెల్‌సెన్స్ డిస్‌ప్లే, 9 గంటల బ్యాటరీ లైఫ్, 64 జీబీ నుంచి 500 జీబీ దాకా స్టోరేజ్ ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. దీని ఖరీదు రూ. 75,000గా ఉండొచ్చని అంచనా. డిసెంబర్‌లో లుమియా 950, లుమియా 950 ఎక్స్‌ఎల్ ఫోన్లను ప్రవేశపెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ తెలిపారు.
సంస్కరణల అమలుతోనే పురోగతి..
గడచిన 12 నెలలుగా తమ క్లౌడ్ వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందిందని, వ్యవస్థాగతమైన సంస్కరణలు అమలవుతుండటం వల్లే ఇది సాధ్యపడిందని తాను భావిస్తున్నట్లు నాదెళ్ల పేర్కొన్నారు. ప్రభుత్వ విభాగాలతో సాధ్యమైనంత వరకూ ఘర్షణాత్మక పరిస్థితి లేకుండా చూసుకునేందుకే తాను ప్రాధాన్యం ఇస్తానని ఎడిటర్లతో జరిగిన సమావేశంలో ఆయన వివరించారు. ఏడాది క్రితం ప్రవేశపెట్టిన తమ క్లౌడ్ సర్వీసులను ప్రైవేట్ సంస్థలే కాకుండా ప్రభుత్వ సంస్థలు కూడా పెద్ద ఎత్తున వినియోగిస్తుండటం తనను ఆశ్చర్యపర్చిందన్నారు.