మొబైల్స్‌కు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై!! | Microsoft wasted at least $8 billion on its failed Nokia experiment | Sakshi
Sakshi News home page

మొబైల్స్‌కు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై!!

Published Thu, May 26 2016 2:14 AM | Last Updated on Tue, Oct 9 2018 4:06 PM

మొబైల్స్‌కు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై!! - Sakshi

మొబైల్స్‌కు మైక్రోసాఫ్ట్ గుడ్‌బై!!

స్మార్ట్‌ఫోన్ల తయారీ నిలిపివేత
* ఇదివరకే ఫీచర్ ఫోన్ల వ్యాపారం విక్రయం  
* సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులపైనే అధిక దృష్టి

హెల్సింకి: అలవాటు లేని వ్యాపారాలకు స్వస్తి చెప్పాలని సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నిర్ణయించుకుంది. ఒకవైపు ప్రత్యర్థుల నుంచి విపరీతమైన పోటీ.. మరొకవైపు లూమియా, విండోస్ ఫోన్ల వ్యూహాలు బెడిసికొట్టడంతో... స్మార్ట్‌ఫోన్ల తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెండేళ్ల క్రితం నోకియా నుంచి 7.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ ప్రయోగానికి స్వస్తి పలకనుంది. తాజాగా కంపెనీ దాదాపు 1,850 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

అంటే నోకియా ఉద్యోగుల్లో చాలావరకూ ఇక మైక్రోసాఫ్ట్‌లో పనిచేయరు. నోకియాను కొనుగోలు చేసినపుడు దాని 25 వేల మంది ఉద్యోగుల్ని మైక్రోసాఫ్ట్ తీసుకుంది. తాజాగా తొలగిస్తున్న వారిలో 1,350 మంది ఫిన్‌లాండ్‌కి చెందిన వారైతే.. మిగిలిన వారు  వివిధ దేశాల్లో పనిచేస్తున్నవారు ఉంటారని అంచనా.
 
స్మార్ట్‌ఫోన్ల తయారీ బంద్!
స్మార్ట్‌ఫోన్ల డిజైన్, తయారీకి దూరంగా ఉంటామని మైక్రోసాఫ్ట్‌కు ఫిన్లాండ్‌లో చీఫ్ షాప్ స్టివార్డ్‌గా వ్యవహరిస్తున్న కల్లే కీలి చెప్పారు. సాఫ్ట్‌వేర్‌పైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తామన్నారు. ‘ఎక్కడైతే మేం ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నామో.. ఆ విభాగంపైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తాం’ అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా తెలిపారు. అంటే కంపెనీ విండోస్-10 మొబైల్ ప్లాట్‌ఫామ్ అభివృద్ధి, క్లౌడ్ సేవలకు ఇక ప్రాధాన్యమివ్వనుంది.
 
ఫాక్స్‌కాన్‌కు ఫీచర్ ఫోన్ల వ్యాపారం విక్రయం
మైక్రోసాఫ్ట్ ఇటీవలే నోకియా ఫీచర్ ఫోన్ల హక్కులను హెచ్‌ఎండీ గ్లోబల్‌కు, ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ అనుబంధ సంస్థ ఎఫ్‌ఐహెచ్ మొబైల్‌కు 35 కోట్ల డాలర్లకు విక్రయించింది. దీంతో హెచ్‌ఎండీ గ్లోబల్, ఎఫ్‌ఐహెచ్ మొబైల్ సంస్థలు నోకియా బ్రాండ్ మొబైళ్లను, ట్యాబ్లెట్స్‌ను సంయుక్తంగా తయారుచేసి విక్రయిస్తాయి. కాగా అంతర్జాతీయంగా గత త్రైమాసికంలో 24 లక్షల విండోస్ ఫోన్ల అమ్మకం జరిగిందని రీసెర్చ్ సంస్థ గార్ట్‌నర్ తెలిపింది.

ఇది మొబైల్ హ్యాండ్‌సెట్స్ మార్కెట్‌లో 0.7 శాతం. 2015 తొలి త్రైమాసికంలో విండోస్ ఫోన్ మార్కెట్ 2.5 శాతంగా ఉండేది. ఇక ఆండ్రాయిడ్ ఫోన్ల మార్కెట్ 84 శాతంగా, యాపిల్ ఓఎస్ ఫోన్ల మార్కెట్ 15 శాతంగా ఉందని గార్ట్‌నర్ తెలియజేసింది. కాగా మైక్రోసాఫ్ట్ తొలిసారి 1986లో ఐపీవోకు వచ్చింది. తర్వాత 1990 నుంచి విస్తరణ దిశగా అడుగులు వేస్తూ వచ్చింది. 2011 మేలో స్కైప్ టెక్నాలజీస్‌ను 8.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇదే కంపెనీ చరిత్రలో అతిపెద్ద కొనుగోలు. అటుపై 2014లో నోకియాను 7.2 బిలియన్ డాలర్లకు విలీనం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement