
మొబైల్ చార్జీలు దిగొచ్చే చాన్స్
పూర్తి స్థాయి స్పెక్ట్రం షేరింగ్‌కు ట్రాయ్ సిఫార్సులు
తగ్గనున్న టెల్కోల వ్యయాలు
న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు అన్ని రకాల స్పెక్ట్రంను పరస్పరం పంచుకునేందుకు (స్పెక్ట్రం షేరింగ్) అనుమతించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది. దీంతో ఒకవైపు వ్యయాల తగ్గుదల రూపంలో టెల్కోలకు, కాల్ చార్జీల తగ్గుదల రూపంలో మొబైల్ వినియోగదారులకూ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. స్పెక్ట్రం షేరింగ్ విధివిధానాలకు సంబంధించి ట్రాయ్ సోమవారం చేసిన సిఫార్సుల ప్రకారం 2జీ, 3జీ, 4జీ సర్వీసులు అందించేందుకు వివిధ స్పెక్ట్రం బ్యాండ్‌లను టెలికం కంపెనీలు పరస్పరం పంచుకోవచ్చు. అయితే, తమ దగ్గర ఉన్న ఒకే రకమైన బ్యాండ్ స్పెక్ట్రంను మాత్రమే పంచుకోవడానికి వీలు ఉంటుంది.
అంటే..3జీ స్పెక్ట్రం ఉన్న సంస్థలు 3జీ స్పెక్ట్రంను మాత్రమే ఇచ్చిపుచ్చుకోవడానికి వీలుంటుంది. అంతే తప్ప 4జీ స్పెక్ట్రంను పంచుకోవడానికి కుదరదు. అలాగే, ఈ తరహా ఒప్పందాలు రెండు సంస్థలకు మాత్రమే పరిమితమవుతాయి. గతంలో వేలం లేకుండా అసైన్ చేసిన స్పెక్ట్రం, పాత రేటు రూ. 1,658 కోట్లకు కేటాయించిన స్పెక్ట్రంనకు కూడా ఇది వర్తిస్తుంది. ట్రాయ్ సిఫార్సులపై టెలికం విభాగం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, ఆర్‌కామ్, ఎయిర్‌సెల్, టాటా టెలీ తదితర కంపెనీలకు దీనివల్ల ప్రయోజనం చేకూరనుంది. స్పెక్ట్రం వ్యయాలు గణనీయంగా తగ్గితే.. టెల్కోలు ఆ ప్రయోజనాలను టారిఫ్‌ల తగ్గింపు రూపంలో యూజర్లకు బదలాయించే అవకాశం ఉంది.
స్పెక్ట్రం వ్యయాలను తగ్గే దిశగా తగు చర్యలు తీసుకోవాలంటూ ఆర్థిక సర్వే ఇటీవలే సూచించిన నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం 800 మెగాహెట్జ్ (సీడీఎంఏ సర్వీసులకు), 900..1800..2100 మెగాహెట్జ్ (2జీ,3జీ సేవలకు), 2300..2500 మెగాహెట్జ్ (4జీ సర్వీసులకు) బ్యాండ్‌లలో స్పెక్ట్రంను ప్రభుత్వం టెలికం కంపెనీలకు ఇస్తోంది. పాత లెసైన్సింగ్ విధానంలో ధరతో పోలిస్తే ఇటీవలి స్పెక్ట్రం వేలం ధరలు ఏకంగా అయిదు రెట్లు అధికంగా ఉన్నాయి. టెలికం ఆపరేటర్ల మధ్య ప్రస్తుతం కొంత మేర సర్దుబాటు ఒప్పందాలు ఉంటున్నాయి.
స్పెక్ట్రం కాకుండా.. మొబైల్ టవర్లు వంటి మౌలిక సదుపాయాలను పంచుకుంటున్నాయి. అయితే, నూతన లెసైన్సింగ్ విధానం కింద పొందిన స్పెక్ట్రంను పంచుకునేందుకు 2012 ఫిబ్రవరిలో ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోద ముద్ర వేసింది. అలాగే, వేలం లేకుండా కేటాయించిన స్పెక్ట్రంను కూడా వన్‌టైమ్ చార్జీ కట్టి కంపెనీలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు కూడా సూత్రప్రాయంగా ఆమోదించింది. అయితే, వన్‌టైమ్ ఫీజుపై టెలికం కంపెనీలు కోర్టుకెళ్లడంతో ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.
ఎంఎన్‌పీ లెసైన్సు ఫీజు యథాతథం..
దేశవ్యాప్తంగా మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ)ని అందుబాటులోకి రానున్నప్పటికీ.. ఈ సర్వీసుల ందించే సంస్థల లెసైన్సు ఫీజులు, బ్యాంకు గ్యారంటీలను పెంచాల్సిన అవసరం లేదని ట్రాయ్ పేర్కొంది. వీటిని యథాతథంగానే ఉంచవచ్చని టెలికం విభాగానికి తెలిపింది. ఎంఎన్‌పీ వాడకం ఒక మోస్తరుగానే ఉంటున్నందున ఈ సంస్థల ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని వివరించింది. దేశవ్యాప్త సర్వీసులకు ఇవి అదనపు మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో వాటిపై భారం భారీగా పెరుగుతుందని ట్రాయ్ వివరించింది. ఎంఎన్‌పీ వల్ల ఆపరేటరును మార్చినా పాత మొబైల్ నంబరునే కొనసాగించే వీలుంటుంది.