వృద్ధి అంచనాలు కట్
• 7.3 శాతానికి తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ
• 7.1 శాతానికి కుదించిన బీవోఎఫ్‌ఎ
• నోట్ల రద్దు ప్రభావమే కారణం
ముంబై: నోట్ల రద్దు పరిణామాల నేపథ్యంలో కన్సల్టెన్సీ సంస్థ మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్‌లు (బీవోఎఫ్‌ఎ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను కుదించారుు. పెద్ద నోట్ల రద్దు సమీప భవిష్యత్‌లో ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చంటూ వృద్ధి అంచనాలను మోర్గాన్ స్టాన్లీ.. 7.7 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది. అలాగే, 2017-18 అంచనాలను కూడా 7.8 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ.. 2018-19లో 7.9 శాతంగా ఉండొచ్చని పేర్కొంది.
పెద్ద నోట్ల రద్దు కారణంగా డిసెంబర్ ఆఖరు దాకా నగదు లావాదేవీలు అస్తవ్యస్తమై, దేశీయంగా డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడగలదని తెలిపింది. నల్లధనంపై పోరు పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల మూలంగా గృహస్తులు.. సమీప భవిష్యత్‌లో భారీ కొనుగోళ్లను నిలిపివేయొచ్చని, మధ్యకాలికంగా ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేయడం తగ్గవచ్చని వివరించింది. ’మొత్తం మీద దేశం వృద్ధి బాటలోనే ఉన్నా, పెద్ద నోట్ల రద్దు పరిణామం సమీప భవిష్యత్‌లో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో వృద్ధి రికవరీ మందకొడిగా ఉండవచ్చు’ అని తెలిపింది.
మరోవైపు, విదేశాల్లో డిమాండ్ మెరుగుపడి, కమోడిటీయేతర ఉత్పత్తుల సారథ్యంలో గడిచిన నాలుగు నెలలుగా ఎగుమతులు పెరుగుతుండటం సానుకూల అంశమని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. 2016లో 3 శాతంగా ఉన్న ప్రపంచ దేశాల వృద్ధి 2017లో 3.4 శాతానికి పెరగవచ్చని, భారత్ నుంచి ఎగుమతులు కూడా దీనికి తోడ్పడగలవని తెలిపింది. 2017 తొలి త్రైమాసికం అనంతరం పరిస్థితులు కాస్త చక్కబడి.. ప్రైవేట్ పెట్టుబడులు మొదలైతే 2018 నుంచి ఎకానమీ పూర్తి స్థారుులో దూసుకుపోతుందని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది.
30 బేసిస్ పారుుంట్లు కట్: బీవోఎఫ్‌ఎ
డీమానిటైజేషన్ దరిమిలా 2016-17లో భారత్ వృద్ధి ముందుగా భావించిన దానికన్నా 30 బేసిస్ పారుుంట్లు తక్కువగా 7.1 శాతం స్థారుులో మాత్రమే ఉండగలదని బీవోఎఫ్‌ఏ పేర్కొంది. అటు 2017-18లో కూడా జీడీపీ వృద్ధి 30 బేసిస్ పారుుంట్ల తగ్గుదలతో 7.3 శాతంగా ఉండగలదని వివరించింది. 2016-17లో 7.4 శాతంగాను, 2017-18లో 7.6 శాతంగాను భారత్ వృద్ధి ఉండొచ్చని బీవోఎఫ్‌ఎ గతంలో అంచనా వేసింది.
మరోవైపు డిసెంబర్ 7న జరిగే ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ పాలసీ రేట్లను 25 బేసిస్ పారుుంట్ల మేర తగ్గించవచ్చని పేర్కొంది. అరుుతే, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) అంశం ద్వారా వడ్డీ ఆదాయమేదీ రాదు కనుక ఒకవేళ ఆర్‌బీఐ పాలసీ రేట్లు 25 బేసిస్ పారుుంట్లు తగ్గించినా బ్యాంకులు మాత్రం ఆ మేరకు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించలేకపోవచ్చని బీవోఎఫ్‌ఎ తెలిపింది. ప్రభుత్వం మార్కెట్ స్థిరీకరణ పథకం (ఎంఎస్‌ఎస్) బాండ్లను తగు పరిమాణంలో జారీ చేసిన తర్వాత సీఆర్‌ఆర్ పెంపు నిర్ణయాన్ని సమీక్షిస్తామంటూ ఆర్‌బీఐ వెల్లడించడం సానుకూలాంశమని బీవోఎఫ్‌ఎ తెలిపింది.