భారత్లో అపార అవకాశాలు
♦ దక్షిణాఫ్రికా వ్యాపారవేత్తలకు ప్రధాని మోదీ పిలుపు
♦ ద్వైపాక్షిక వాణిజ్యం మరిన్ని రంగాలకు విస్తరించాలని ఆకాంక్ష
ప్రిటోరియా (దక్షిణాఫ్రికా) : విస్త్రత పెట్టుబడులు చేయడం ద్వారా... విభిన్న రంగాల్లోకి ప్రవేశించడం ద్వారా భారత వాణిజ్య మార్కెట్‌లోని అపార అవకాశాలను అందిపుచ్చుకోవాలని దక్షిణాఫ్రికా వ్యాపారవేత్తలకు ప్రధాని మోదీ సూచించారు. భారత్‌ను మరింత ఉదార ఆర్థిక వ్యవస్థగా పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా సహా ఇరు దేశాలకు చెందిన 500 ప్రముఖ వ్యాపారవేత్తలతో శుక్రవారం ఇక్కడ జరిగిన సమావేశంలో ప్రధాని మాట్లాడారు. రెండు దేశాల మధ్య చరిత్రాత్మక సంబంధాల విషయంలో నెల్సన్ మండేలా, మహాత్మాగాంధీల కృషిని ఆయన ప్రశంసించారు. భౌగోళికంగా ఉన్న అనుసంధానాన్ని సైతం అనుకూలంగా మలచుకోవాలని వ్యాపారవేత్తలకు సూచించారు.
దక్షిణాఫ్రికా వ్యాపార వేత్తల సమర్థత, భారత కంపెనీల సామర్థ్యం ఒకరినొకరికి ఉపయోగపడాలని, రెండు దేశాల అభివృద్ధికి దారితీయాలని ఆశించారు. భారత్ అధిక వృద్ధి రేటు (7.6శాతం)ను నమోదు చేస్తోందని, వ్యాపార సులభతరం చేయడంతోపాటు, పర్యావరణ అనుకూల విధానాలను చేపడుతున్నామని ప్రధాని తెలియజేశారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరిన్ని రంగాల్లోకి విస్తృతం చేసుకోవడానికి ఉన్న అవకాశాలపై దృష్టి సారించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. భారత్‌ను మరింతగా తెరిచి ఉంచిన ఆర్థిక వ్యవస్థగా పేర్కొన్న ఆయన చాలా రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవేశానికి నిబంధనలను సరళీకరించామని తెలిపారు. నిబంధనలను హేతుబద్దీకరించడం ద్వారా సులభంగా వ్యాపారాలను ప్రారంభించి ఎదిగేందుకు వీలు కల్పించామని ప్రధాని తెలిపారు.
భారత్ నిర్మిస్తుంది... కొల్లగొట్టదు
దక్షిణాఫ్రికాలో ఇప్పటికే చైనా పాతుకుపోగా, భారత్ చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో రెండు దేశాల మధ్య ఉన్న వైవిధ్యాన్ని మోదీ తన మాటల్లో తెలియజేశారు. భారత్ నిర్మాణానికి కృషి చేస్తుందేగానీ, కొల్లగొట్టదన్నారు. ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందడాన్ని చూడాలన్న మహాత్మా గాంధీ మాటల్ని ఉటంకించారు. దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయ కంపెనీలు మానవతా స్ఫూర్తితో పనిచేయాలని, అది వారి వ్యాపారంలో కనిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికా సామాజిక, ఆర్థిక పురోగతికి భారతీయ కంపెనీలు తోడ్పడాలని తనతో ఉన్న భారత కంపెనీల సీఈవోలకు ఆయన సూచించారు.
భారత్‌కు తాను మూడు ‘పి’లు (ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం, ప్రజల భాగస్వామ్యంగా వి) సూచిస్తానన్నారు. అదే ఇక్కడ కూడా వర్తిస్తుందన్నారు. అపార సహజ వనరులు రెండు దేశాల సొంతమని వాటిని సామాన్య ప్రజల సంక్షేమం కోసం సరైన విధంగా వినియోగించుకోవాలని ఆశించారు. దక్షిణాఫ్రికా దేశానికి చెందిన ప్రపంచ స్థాయి మైనింగ్ కంపెనీలతో మరింతగా కలసి పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ దిశగా వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకోవాలనుకుంటున్నామని, ఈ రంగంలో తమ ఆసక్తి ఏకపక్షంగా ఉండరాదన్నారు. దక్షిణాఫ్రికా ఆహార శుద్ధి పరిశ్రమకు భారత్‌లో భారీ అవకాశాలు ఉన్నాయన్నారు. రక్షణ రంగం నుంచి డెయిరీ వరకు, హార్డ్‌వేర్ నుంచి సాఫ్ట్‌వేర్; ఔషధాల నుంచి వైద్య పర్యాటకం; నైపుణ్యాల నుంచి శాస్త్ర సాంకేతికత వరకు రెండు దేశాలు కలసి పనిచేసేందుకు అవకాశాలున్నాయని చెప్పారు.