కృష్ణపట్నం పోర్టు నుంచి కొత్త రైలు సర్వీసులు
ఐసీడీ బెంగళూరుకు వారానికి 2 సర్వీసులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కంటెయినర్ కార్పొరేషన్‌తో (కాన్‌కార్) కలసి కృష్ణపట్నం పోర్టు కంపెనీ (కేపీసీఎల్) కొత్త రైలు సర్వీసులు ప్రారంభించింది. కృష్ణపట్నం పోర్టు నుంచి ఇన్‌ల్యాండ్ కంటెయినర్ డిపో (ఐసీడీ) బెంగళూరు మధ్య వారానికి రెండుసార్లు ఈ సర్వీసులుంటాయి. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఎగుమతి, దిగుమతిదారులకు సురక్షితమైన ప్రత్యామ్నాయ రవాణా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించినట్లు కేపీసీఎల్ సీఈవో అనిల్ యెండ్లూరి తెలిపారు.
దీనివల్ల సరుకు రవాణా సమయం 48 గంటలకు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. రోడ్డు మార్గంలో బరువుపరమైన నియంత్రణ సమస్యలు ఎదుర్కొనే భారీ కార్గోల రవాణాకు ఈ సర్వీసులు తోడ్పడగలవని అనిల్ చెప్పారు. ఎగుమతులకు ఉద్దేశించిన వస్తూత్పత్తులు బెంగళూరు నుంచి ప్రతి మంగళ, శుక్రవారం ఈ రైలు సర్వీస్ ద్వారా పోర్టుకు చేరతాయి. అలాగే దిగుమతైనవి ప్రతి బుధ, శనివారం పోర్టు నుంచి బయలుదేరి ఐసీడీ బెంగళూరుకు చేరతాయి.