హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసీ) వరుసగా వచ్చే రెండు ఆర్ధిక సంవత్సరాల్లో రూ.6,500 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఇనుము ఖనిజ నిక్షేపాలు, ఉత్పాదనపై గత ఆర్ధిక సంవత్సరంలో రూ.2,800 కోట్లు మూలధన వ్యయం వెచ్చించామని.. ఈ ఆర్ధిక సంవత్సరంలో (2019) రూ.3,185 కోట్లు, వచ్చే ఆర్ధిక సంవత్సరంలో (2020) రూ.3,290 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఎన్‌ఎండీసీ సీఎండీ భజేంద్ర కుమార్ తెలిపారు. బుధవారమిక్కడ జరిగిన ఏజీఎం సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2020 నాటికి చత్తీస్‌గఢ్‌లోని నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని.. ఇప్పటివరకు ఈ ప్లాంట్ మీద రూ.14,182 కోట్లు వెచ్చించామని ఆయన తెలిపారు. మరో మూడు నెలల్లో నాగర్నార్ స్టీల్ ప్లాంట్‌లో బ్లాస్ట్ ఫ్యూర్‌నెన్స్ (పేలుడు కొలిమి) ప్రారంభమవుతుందని.. ఆ తర్వాత కాస్టింగ్ మిషనరీని రూపొందిస్తామని.. వచ్చే ఏడాది మే లేదా జూన్ నుంచి ఉక్కు తయారీ మొదలవుతుందని ఆయన తెలియజేశారు. దీని ఉత్పత్తి సామర్థ్యం ఏటా 30 లక్షల టన్నుల వరకుంటుందని పేర్కొన్నారు.
ఏటా 6.7 కోట్ల టన్నుల లక్ష్యం..: చత్తీస్‌గఢ్‌లోని బైలాడిల్లా గనుల వద్ద భారీ వర్షాల కారణంగా ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇనుము ఉత్పత్తి తగ్గిందని.. ఈ సంవత్సరం రెండో భాగంలో 3.6 కోట్ల నుంచి 3.7 కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. 2021–22 నాటికి ఏటా ఇనుము ఉత్పత్తి సామర్థ్యం 6.7 కోట్ల టన్నులుగా పెట్టుకున్నామని తెలిపారు. లక్ష్యాన్ని చేరుకోవటానికి ఇప్పటికే ఉన్న గనుల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడంతో పాటూ కొత్త గనుల కోసం అన్వేషణ సాగిస్తున్నామని ఆయన వివరించారు. ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచడం కోసం బైలాడిల్లాలో 12 ఎంటీపీఏ, కర్నాటకలోని డొనైమాలైలో 7 ఎంటీపీఏల్లో రెండు కొత్త స్క్రీనింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ ఏడాది ముగింపు నాటికి చత్తీస్‌గఢ్‌లోని కుమారమారంగలో 5 లక్షల టన్నుల ఇనుప ఖనిజ ఇంటర్మీడియట్ స్టాక్‌ప్లీలను కూడా అభివృద్ధి చేస్తున్నామని.. దీంతో రాత్రి సమయాల్లోనూ నిరంతరాయంగా ఇనుము పంపిణీ అవుతుందని ఆయన వివరించారు.
రెండేళ్లలో రూ.6,500 కోట్లు
Published Thu, Sep 27 2018 12:55 AM | Last Updated on Thu, Sep 27 2018 12:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment