
దేశీ మార్కెట్లపై ఆశావహ ధోరణులు పెరుగుతున్న నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (ఎఫ్‌పీఐ) మళ్లీ పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఏఎంసీ సీఈవో బాలసుబ్రమణియన్. అలాగే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (సిప్) రూపంలో దేశీయంగా కూడా పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సాక్షి ప్రాఫిట్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఈ ఏడాది గణనీయంగా వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. రిస్కులు, ప్రయోజనాలపరంగా చూస్తే మ్యూచువల్ ఫండ్స్ మెరుగైన సాధనాలు. పొదుపు (లిక్విడ్ ఫండ్స్), రాబడి (ఫిక్స్‌డ్ ఇన్‌కం స్కీమ్స్), సంపద సృష్టి (ఈక్విటీ పథకాలు), పన్ను ఆదా స్కీమ్స్ (ఈఎల్‌ఎస్‌ఎస్ పథకాలు).. ఇలా అవసరం ఏదైనా ప్రతి దానికీ ఒక స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఆర్థిక లక్ష్యాలు చేరుకోవాలంటే ఎల్లవేళలా ఒకే దాంట్లో ఇన్వెస్ట్ చేయకుండా.. వివిధ సాధనాలకు కేటాయించడం శ్రేయస్కరం. ఈ నేపథ్యంలో ఫిక్స్‌డ్ ఇన్‌కం పథకాలు ప్రతీ ఒక్కరి పోర్ట్‌ఫోలియోలో ఉండతగినవి. ప్రస్తుతం బ్యాంకుల్లో రూ. 69 లక్షల కోట్లు ఎఫ్‌డీల రూపంలో ఉన్నాయని అంచనా. వీటితో పోలిస్తే మ్యూచువల్ ఫండ్ ఫిక్స్‌డ్ ఇన్‌కం పథకాలు ఇటు మెరుగైన రాబడులు అందించడంతో పాటు పన్నులపరమైన ప్రయోజనాలు కూడా ఇస్తాయి.
సంస్కరణలతో ఊతం ..
అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలు, దేశీయంగా బ్యాంకుల మొండిబాకీలు పెరిగిపోవడం, రూపాయి పతనం, వ్యాపార రంగంలో సంక్షోభాలు మొదలైన వాటితో గతేడాది సవాళ్లమయంగా సాగింది. అయితే, 2019లో పరిస్థితులు ఆశావహంగానే ఉంటాయన్న అంచనాలు నెలకొన్నాయి. చమురు ధరలు కాస్త ఉపశమించడం, రూపాయి కొంత బలపడుతుండటం మొదలైనవి ఇందుకు ఊతమిస్తున్నాయి. వ్యవస్థాగతంగా ప్రవేశపెట్టిన వివిధ సంస్కరణలు క్రమంగా ఫలాలిస్తున్న నేపథ్యంలో భారత్‌పై అంతర్జాతీయ ఏజెన్సీలు కూడా ఆశావహ అంచనాలే వెలువరిస్తున్నాయి. వినియోగమే దేశ ఎకానమీ వృద్ధికి చోదకంగా నిలుస్తుందనడానికి నిదర్శనంగా ప్రైవేట్ వినియోగం ఈసారి మరింత ముఖ్యపాత్ర పోషించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం మరింతగా వ్యయం చేస్తుండటం కూడా వినియోగ వృద్ధికి ఊతమివ్వనుంది. ఇక దివాలా చట్టం అమల్లోకి వచ్చాక బ్యాంకుల ఖాతాల ప్రక్షాళన జరగడం కూడా ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు మెరుగుపడటానికి దోహదపడనుంది. ఇక జీఎస్‌టీ విధానం కూడా స్థిరపడితే, పన్నుల రేట్లు తగ్గిన పక్షంలో వినియోగంతో పాటు మొత్తం మీద ట్యాక్స్ చెల్లించే వారి సంఖ్య కూడా పెరిగేందుకు ఊతమిస్తుంది. సెంటిమెంట్ అంతా సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ.. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు కీలకపాత్ర పోషించనున్నాయి. ఎన్నికలు జరగడానికి ముందు, తర్వాత ఆరు నెలల డేటా పరిశీలిస్తే మార్కెట్లు పాజిటివ్‌గానే స్పందించిన దాఖలాలే ఉన్నాయి. ఏదైతేనేం.. అంతిమంగా ఫండమెంటల్స్, ఎకానమీ స్థిరత్వమే మార్కెట్ పనితీరును ప్రభావితం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment