
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ రంగంలో గడ్డు పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. జనవరి నెలలోనూ ప్రయాణికుల వాహనాల్లో 2 శాతం క్షీణత నమోదైంది. వరుసగా మూడో నెలలోనూ డిమాండ్ క్షీణించింది. దీంతో మొత్తం 2,80,125 వాహనాలు అమ్ముడయ్యాయని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ తెలిపింది. పండుగ సీజన్‌లో అమ్మకాలు ఆశించినంత లేకపోవడంతో నిల్వలను తగ్గించుకోవడంపై తయారీదారులు దృష్టి పెట్టినట్టు పేర్కొంది. క్రితం ఏడాది జనవరిలో అమ్ముడైన వాహనాలు 2,85,467 యూనిట్లుగా ఉన్నాయి.
కార్ల విక్రయాలు వరుసగా మూడో నెలలోనూ తగ్గాయి. క్రితం ఏడాది జనవరితో పోలిస్తే 2.65% తగ్గి 1,79,389 యూనిట్లుగా ఉన్నాయి. మారుతి సుజుకి ప్యాసింజర్ వాహన విక్రయాలు జనవరిలో 0.18 శాతమే పెరిగాయి. 1,39,440 వాహనాలను ఈ సంస్థ విక్రయించింది. ప్యాసింజర్ కార్ల అమ్మకాల వరకే చూస్తే 1,01,865 యూనిట్లుగా ఉన్నాయి.
- ఇది క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 4 శాతం తక్కువ.
- హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్ల అమ్మకాలు 1.58% తగ్గి 35,439 యూనిట్లుగా ఉన్నాయి.
- మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 0.88 శాతం వృద్ధితో 23,864 యూనిట్లుగా ఉన్నాయి.
- హోండా కార్లు మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 52 శాతం పెరిగాయి. 14,383 కార్లను విక్రయించింది.
- ద్విచక్ర వాహన విక్రయాలు జనవరిలో 5.18 శాతం తగ్గి 15,97,572 యూనిట్లుగా ఉన్నట్టు సియామ్ తెలిపింది.
- మోటారు సైకిళ్ల వరకే చూసినా 2.55 శాతం క్షీణతతో 10,27,810 యూనిట్లుగా ఉండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment