న్యూఢిల్లీ : గవర్నర్‌తో కూర్చుని ఓ కప్పు కాఫీ తాగాలని ఉందా.. ఎయిర్‌పోర్టులో ప్రియారిటీ చెక్-ఇన్ చేయించుకోవాలని ఉందా, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సస్ కావాలని ఉందా.. అయితే పన్నులు సక్రమంగా కట్టండి. ఉత్తమమైన పన్ను చెల్లింపుదారులకు పలు రివార్డులను అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిలో భాగంగా నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులను ప్రభుత్వం గుర్తిస్తోంది. దీని కోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఈ స్కీమ్ కింద అర్హులయ్యే పన్ను చెల్లింపుదారులను గుర్తిస్తుందని సీబీడీటీ ఉన్నతాధికారులు చెప్పారు.
ఎక్కువ మంది ఇన్‌కమ్-ట్యాక్స్ రిటర్నులను ఫైల్ చేయడానికి, నిజాయితీగా పన్నులు చెల్లించడానికి ఈ రివార్డు ప్రొగ్రామ్ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో ఉన్న రివార్డు ప్రొగ్రామ్‌లను కమిటీ పరిశీలిస్తోంది. అయితే ఉత్తమమైన పన్ను చెల్లింపుదారుల్లో కేవలం, పన్నులు కట్టే ప్రక్రియనే మాత్రమే కాక, రిటర్నులను దాఖలు చేసే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. అంతకముందు కూడా పన్ను చెల్లింపుదారుల కోసం సమ్మాన్ అనే స్కీమ్‌ను ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2004 తర్వాత దీన్ని క్లోజ్ చేశారు.
పలు దేశాల్లో ఉన్న రివార్డు ప్రొగ్రామ్‌లు...
పలు దేశాల్లో నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు రివార్డు ప్రొగ్రామ్‌లను అవలంభిస్తున్నాయి. చక్రవర్తితో ఫోటోలు తీసుకునే అవకాశాన్ని జపాన్ కల్పిస్తోంది. దక్షిణ కొరియా సర్టిఫికేట్లను, ఎయిర్‌పోర్టులో వీఐపీ రూమ్‌ల యాక్సస్‌ను, ఫ్రీ పార్కింగ్‌ను అందజేస్తుండగా.. పాకిస్తాన్ ప్రతేడాది టాప్ 100 పన్ను చెల్లింపుదారులకు ఎయిర్‌పోర్టుల్లో వీఐపీ లాంజ్‌ల యాక్సస్‌ను ఆఫర్ చేస్తోంది. ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో త్వరగా క్లియరెన్స్, ఉచిత పాస్‌పోర్టులను, బ్యాగేజీ అలవెన్స్‌ను అందిస్తోంది. ఇలా పలు దేశాల్లో పన్ను రివార్డుల స్కీమ్‌లు కొనసాగుతున్నాయి. తాజాగా మన దేశంలో కూడా ఉత్తమమైన పన్ను చెల్లింపుదారులను గుర్తించి, వారికి రివార్డులను అందించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment