
పేటీఎం మాల్‌లో కొత్త ఉద్యోగాల గంట
పేటీఎం కొత్త ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ పేటీఎం మాల్ భారీగా ఉద్యోగాల నియామకానికి సిద్ధమవుతోంది.
పేటీఎం కొత్త ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ పేటీఎం మాల్ భారీగా ఉద్యోగాల నియామకానికి సిద్ధమవుతోంది. పలు వ్యాపారాలు, టెక్నాలజీ విభాగాల్లో కనీసం 2000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని పేటీఎం మాల్ ప్లాన్ చేస్తోంది. కొత్త నియామకాలతో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని పేటీఎం మాల్ చూస్తోంది. వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ విభాగం పేటీఎం ఇటీవలే పేటీఎం మాల్‌ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా తమ ఈకామర్స్ వ్యాపారాల్లో పాల్గొనే 800కి పైగా ఉద్యోగులను వన్97 కమ్యూనికేషన్స్ నుంచి కొత్తగా ఏర్పాటుచేసిన పేటీఎం మాల్‌కు కేటాయించింది.
పేటీఎం మాల్ ఇటీవలే 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులను ఎస్‌ఏఐఎఫ్ పార్టనర్, అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ నుంచి సేకరించింది. తాము ఎక్కువమొత్తంలో ఉత్పత్తులను కస్టమర్లకు వారి స్మార్ట్‌ఫోన్ల ద్వారానే అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నామని, అదేవిధంగా లోకల్ షాప్‌కీపర్లు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ సమాన నిష్ఫత్తిలో విక్రయించుకునేలా చేస్తున్నామని పేటీఎం మాల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ సిన్హా చెప్పారు. పేటీఎం మాల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, ఫ్యాషన్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మొబైల్స్, కిచెన్, ఫుట్‌వేర్, ఫిట్‌నెస్ అండ్ స్పోర్ట్స్ వంటి పలు కేటగిరిలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇందులో 1,40,000 విక్రయదారులకు చెందిన దాదాపు 6.8 కోట్ల ప్రొడక్టులను అందుబాటులో ఉంచామని తెలిపింది.