ఫైజర్-అలెర్గాన్ డీల్ రద్దు!
♦ అమెరికాలో పన్ను నిబంధనల మార్పే కారణం
♦ జనరిక్ వ్యాపారాన్ని విడదీయటంపై త్వరలో ఫైజర్ నిర్ణయం
♦ తెవా ఫార్మాకు జనరిక్స్‌ను విక్రయిస్తాం: అలెర్గాన్
న్యూయార్క్: ఇరు కంపెనీల విలీనానికి సంబంధించి అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్- ఐర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న అలెర్గాన్ కుదుర్చుకున్న ఒప్పం దం రద్దయింది. 160 బిలియన్ డాలర్ల విలువైన ఈ డీల్‌ను అంతర్జాతీయ ఫార్మా రంగంలో అతిపెద్ద డీల్‌గా పేర్కొనటం తెలిసిందే. ప్రధానంగా అమెరికాలోని పన్నుల్ని తప్పించుకోవటానికి ఫైజర్ తన కేంద్రాన్ని ఐర్లాండ్‌కు తరలించడానికి ఈ డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ ద్వారా పన్నుల రూపంలో ఏటా బిలియన్ డాలర్లకుపైగా మిగులుతాయని ఫైజర్ భావించింది. అయితే ఇలాంటి డీల్స్‌ను అడ్డుకునేలా ఒబామా యంత్రాంగం ఇన్వర్షన్స్ పేరిట కొత్త పన్ను నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది. జనరిక్స్ వ్యాపారాన్ని విడదీయాలని యోచించిన ఫైజర్... అలెర్గాన్ డీల్ నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని 2019 వరకూ వాయిదా వేస్తున్నట్లు గతంలో ప్రకటించింది. తాజా పరిణామంతో.. ఈ ఏడాదిలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలియజేసింది.