
ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్ వైదొలగడంపై సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి స్పందించారు. సిఎఫ్ఓ ఎండి రంగనాథ్ కంపెనీని వీడడంపై ఆయన విచారాన్ని వెలిబులిచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇన్ఫీకి ఆయన నిష్క్రమణ పూరించలేని లోటని శనివారం వ్యాఖ్యానించారు.
భారతదేశంలో అత్యుత్తమ సీఎఫ్‌వోగా, అరుదైన వ్యక్తిగా రంగనాథ్‌ను అభివర్ణించిన మూర్తి, చట్టం, గవర్నెర్న్, ముఖ్యమైన ఖాతాదారులు, వాటాదారులు, పెట్టుబడిదారులు, డెలివరీ టీమ్స్, ఉద్యోగి ఆకాంక్షలు, ఫైనాన్స్ లాంటి అన్నింటిని అవగాహన చేసుకున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. రంగాతో తాను15సంవత్సారాలు కలిసి పనిచేశానని గుర్తు చేసుకున్నారు. గత ఐదేళ్లకాలంలో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంపొందించుకోవడంలో ఆయన కీలక పాత్ర పోషించారంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఛాలెంజింగ్ పరిస్థితులలో కఠినమైన నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం, ధృఢమైన ఆర్థిక నైపుణ్యం, బలమైన విలువ వ్యవస్థ, మర్యాద, మన్ననతో గొప్ప లీడర్‌గా గుర్తింపు పొందిన రంగ కంపెనీకి చాలా కీలకమని మూర్తి పేర్కొన్నారు.
కాగా దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థకు సిఎఫ్ఓ రంగనాధ్ రాజీనామా చేశారని, నవంబర్ 16, 2018 వరకు ప్రస్తుత స్థానంలో కొనసాగుతున్నారని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో శనివారం వెల్లడించింది. రాజీవ్ బన్సల్ నిష్క్రమణ అనంతరం 2015లో రంగనాథ్ సీఎఫ్‌వోగా బాధ్యతలు స్వీకరించారు. రాజీవ్ బన్సల్ వంటి మాజీ ఎగ్జిక్యూటివ్‌లకు అందజేసిన ప్యాకేజీలు, కార్పొరేట్ పాలనలాంటి అంశాల్లో గత ఇన్ఫోసిస్ మేనేజ్మెంట్‌తో విభేదించిన నారాయణ మూర్తి తాజా వ్యాఖ‍్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.