ముంబై : టాటా మోటార్స్ నుంచి టిగోర్ ఎలక్ట్రిక్ వాహనం మార్కెట్‌లోకి విడుదలైంది. ఈ వాహనాన్ని టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్‌టాటాలు ఆవిష్కరించారు. గుజరాత్‌లోని సనంద్ ఫ్యాక్టరీ నుంచి ఈ వాహనాన్ని టాటా మోటార్స్ విడుదల చేసింది. 2017 సెప్టెంబర్‌లో టాటా మోటార్స్, ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి 10వేల ఎలక్ట్రిక్ కార్ల టెండర్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. తొలి దశలో భాగంగా 250 టిగోర్ ఎలక్ట్రిక్ వాహనాలను టాటా మోటార్స్ డెలివరీ చేస్తోంది. టాటా మోటార్స్‌కు ఇది ఎంతో కీలకమైన మైలురాయి అని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు.
టీమ్ మొత్తానికి ఇది ఎంతో గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత్‌లో ఈ-మొబిలిటీని అభివృద్ధి చేయడానికి తామంతా కలిసి పనిచేస్తామన్నారు. ఈ ఎలక్ట్రిక్ మోడల్‌కు తమ కస్టమర్లు సానుకూలంగా స్పందిస్తారని తనకు నమ్మకం ఉందని పేర్కొన్నారు. 2030 నాటికి అన్ని ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా ప్రభుత్వం నిర్దేశించుకున్న విజన్‌కు టాటా మోటార్స్ అంకిత భావంతో ఉందని, ఎలక్ట్రిక్ వాహనాలను చాలా వేగవంతంగా అందించడానికి సహకార పద్ధతిలో పనిచేస్తామని కంపెనీ తెలిపింది. ఈ-మొబిలిటీని అభివృద్ధి చేయడానికి టిగోర్ ఈవీతో తమ ప్రయాణం ప్రారంభించామని టాటా మోటార్స్ సీఈవో, ఎండీ గుంటెర్ బుట్చేక్ తెలిపారు. భారత కస్టమర్లకు ఫుల్ రేంజ్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను ఆఫర్ చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment