
టాటా మోటార్స్ యాజమాన్యంలో గల ఎలక్ట్రిక్ వాహన అనుబంధ సంస్థలో రూ.7,500 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ టీపీజీ గ్రూప్ నేడు (అక్టోబర్ 12) ప్రకటించింది. వచ్చే 18 నెలల వ్యవధిలో ఈ పెట్టుబడిని విడతల వారీగా పెట్టుబడి పెట్టనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారంలో భారీగా పెట్టుబడులను ఆహ్వానించినట్లు టాటా మోటార్స్ తెలిపింది. ఎలక్ట్రిక్ వాహన తయారీ విషయంలో అస్సలు తగ్గేదెలే అనే రీతిలో టాటా దూసుకెళ్తుంది. ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కూడా టాటా దే పై చేయి.
"భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ మొబిలిటీ వ్యాపారాన్ని సృష్టించడానికి మా ప్రయాణంలో టీపీజీ రైజ్ క్లైమేట్ మాతో చేరడం నాకు సంతోషంగా ఉంది. ఈవీ తయారీకి అనువైన వాతావరణాన్ని సృష్టించేటప్పుడు కస్టమర్లను ఆహ్లాదపరిచే వాటిపై మేం ముందస్తుగా పెట్టుబడి పెడతాం. భారత ప్రభుత్వం 2030 నాటికి కార్లలో కనీసం 30% ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా ప్రణాళికలను రూపొందించింది. ఆ విషయంలో ప్రముఖ పాత్ర పోషించడానికి మేము సిద్దంగా ఉన్నాము" అని టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. అలాగే 2025 నాటికి భారతీయ వాహన రంగంలోకి 10 కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను(బీఈవీలు) తీసుకురావలని యోచిస్తున్నట్లు కంపెనీ ఛైర్మన్ తెలిపారు. కంపెనీ ఉత్పత్తిలో 60 శాతం 2030 నాటికి పూర్తి బీఈవీ వాహనాలుగా మారతాయి అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment