ముంబై: ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్ వృద్ధికే తన ప్రథమ ప్రాధాన్యం అని సంకేతమిచ్చారు. ధరలు తమ లక్ష్యానికి అనుగుణంగా స్థిరపడితే సమయానుకూలంగా వ్యవహరిస్తామంటూ అవసరానికి అనుగుణంగా భవిష్యత్తులోనూ రేట్ల కోతకు అవకాశాలు ఉంటాయని పరోక్షంగా సంకేతమిచ్చారు. ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ట స్థాయిలకు దిగి రావడం, మరోవైపు రుణాలు భారంగా మారాయని, వడ్డీ రేట్లు తగ్గించాలంటూ పారిశ్రామిక రంగం, ప్రభుత్వం నుంచి వచ్చిన డిమాండ్లను మన్నించారు. బడ్జెట్‌లో తాయిలాలతో తిరిగి ద్రవ్యోల్బణానికి రెక్కలు వస్తాయన్న ఆందోళనలు ఉన్నప్పటికీ.. పరిమితంగా పావు శాతం రేట్లను తగ్గించి ఉపశమనం కల్పించారు. 18 నెలల తర్వాత మళ్లీ ఆర్‌బీఐ వడ్డీ రేటను తగ్గించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఆర్‌బీఐ కొత్త గవర్నర్ శక్తికాంతదాస్ తన ఆధ్వర్యంలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) తొలి భేటీలో (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరవ ద్వైమాసిక సమావేశం) అందరినీ ఆశ్చర్యపరుస్తూ కీలక రెపో, రివర్స్ రెపో రేట్లను పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రెపో రేటు 6.25 శాతానికి, రివర్స్ రెపో 6 శాతానికి దిగొచ్చాయి. క్రమానుగత కఠిన విధానాన్ని ఇప్పటి వరకు అనుసరిస్తుండగా, దీన్ని తటస్థానికి (న్యూట్రల్‌కు) సడలించారు. ఈ నిర్ణయాలతో ఇంటి రుణాలు, ఇతర రుణాలు చౌకగా మారనున్నాయి. ఈఎంఐల భారం తగ్గనుంది. కీలకమైన సార్వత్రిక ఎన్నికల ముందు రుణాల వితరణకు, ఆర్థిక ఉద్దీపనానికి ఆర్‌బీఐ నిర్ణయాలు వీలు కల్పించనున్నాయి.
గతానికి భిన్నంగా... ఆర్‌బీఐ గవర్నర్‌గా వచ్చిన తర్వాత శక్తికాంతదాస్ వివిధ రంగాల ప్రతినిధులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి కోర్కెల గురించి తెలుసుకున్నారు. ద్రవ్యోల్బణం చాలా కనిష్ట స్థాయిల్లో ఉండడం, వృద్ధి రేటు ఆశించినంత లేకపోవడంతో వడ్డీ రేట్లలో కోత విధించొచ్చని ఎక్కువ మంది భావించారు. కానీ, మధ్యంతర బడ్జెట్‌లో రైతులకు ప్రకటించిన ప్యాకేజీ, ఆదాయపన్ను మినహాయింపుల వంటి ప్రోత్సాహకాలతో వినియోగం పెరిగి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆర్‌బీఐ ఎంపీసీ రేట్లను తగ్గించకపోవచ్చని, తటస్థానికి తన విధానాన్ని మార్చొచ్చన్న అభిప్రాయాలూ వినిపించాయి.
కానీ, బడ్జెట్‌కు ముందు వ్యక్తమైన అంచనాలను దాస్ నిజం చేశారు. రేట్ల కోత విధింపునకు ఆరుగురు సభ్యుల ఎంపీసీలో ఆర్‌బీఐ గవర్నర్ సహా నలుగురు అనుకూలంగా ఓటేశారు. తటస్థ విధానానికి మారేందుకు మాత్రం ఆరుగురు అంగీకారం తెలిపారు. 2014 జనవరి 28న కీలక రేట్ల పెంపు తర్వాత నుంచి... రేట్లు తగ్గుతూ వచ్చాయి. దీనికి విరామం పలుకుతూ 2018 జూన్, ఆగస్ట్ సమావేశాల్లో ఆర్‌బీఐ ఎంపీసీ కీలక రేట్లను పావు శాతం చొప్పున పెంచింది. ఈ మధ్య కాలంలో అంటే 2014 జవవరి నుంచి 2018 జూన్‌లోపు ఆరు సార్లు వడ్డీ రేట్లను తగ్గించడం జరిగింది.
వృద్ధి కోసమే కోత...
‘‘పెట్టుబడుల ధోరణి పుంజుకుంటోంది. అయితే, ఇది ప్రధానంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై వెచ్చిస్తున్న నిధుల వల్లే. ప్రైవేటు పెట్టుబడులను, ప్రైవేటు వినియోగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మధ్య కాలానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయిలో కొనసాగించాలన్న లక్ష్యానికి లోబడే వృద్ధికి మద్దతు ఇచ్చేందుకు రేట్ల కోత చేపట్టడం జరిగింది’’ అని ఆర్‌బీఐ పరపతి విధాన కమిటీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బోణీ
రుణ రేటు తగ్గింపు..
ముంబై: ఆర్‌బీఐ రేట్లు తగ్గించిన కొన్ని గంటల వ్యవధిలోనే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ లెండింగ్ రేటును 0.05 శాతం తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, ఆరు నెలల కాల వ్యవధి కలిగిన రుణాలకే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఏడాది సహా మిగిలిన కాల వ్యవధి రుణాలకు ఇంతకుముందు రేట్లే అమలవుతాయి. ఆరు నెలల రుణాలకు ఇక 8.55 శాతం రేటును బ్యాంకు అమలు చేస్తుంది.
చౌకగా రుణాలు...
ఆర్‌బీఐ రెపో రేటును 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించడం, తన విధానాన్ని తటస్థానికి మార్చడం ఆర్థిక రంగానికి బలాన్నిస్తుంది. చిన్న వ్యాపారులకు, ఇళ్ల కొనుగోలుదారులకు చౌకగా రుణాలు లభించేందుకు తోడ్పడుతుంది. ఇది ఉద్యోగ అవకాశాలకూ మరింత ఊతమిస్తుంది.
– పీయూష్ గోయల్, కేంద్ర ఆర్థిక మంత్రి
హౌసింగ్ డిమాండ్ జోరు..
ఈ నిర్ణయం గృహ కొనుగోలు డిమాండ్ పెరుగుదలకు దోహదపడుతుంది. ఆర్‌బీఐ కల్పించిన తాజా వెసులుబాటును బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు బదలాయిస్తాయని భావిస్తున్నాం. మరోపక్క, రియల్టీ రంగానికి ద్రవ్య లభ్యత పెరుగుదల దిశగా మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
– జక్సాయ్ షా, క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్
వ్యాపార వర్గాలకు శుభవార్త...
తాజా పాలసీలో ఆర్‌బీఐ రెపో రేటు తగ్గింపు, దీనితోపాటు ‘జాగరూకతతో కూడిన కఠిన వైఖరి’ నుంచి ‘తటస్థ’ దిశగా తన పాలసీ వైఖరిని మార్చుకోవడం పారిశ్రామిక రంగానికి శుభవార్తలు. వ్యవస్థలో వినియోగం, పెట్టుబడులు రెండూ పెరుగుతాయ్. దీనివల్ల వృద్ధి జోందుకుంటుంది.
– రాకేశ్ భారతీ మిట్టల్, సీఐఐ ప్రెసిడెంట్
మరింత తగ్గే సంకేతాలు...
దేశంలో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ నిర్ధేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. దీంతో రేట్ల కోతకు వెసులుబాటు లభించింది. రానున్న కొద్దికాలంపాటు ధరలు కట్టడిలో ఉండే అవకాశాల నేపథ్యంలో రేటు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆర్‌బీఐ పరపతి విధానం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.
– రజ్‌నీష్ కుమార్, ఎస్‌బీఐ చీఫ్
పాలసీ ముఖ్యాంశాలు...
► రెపో రేటు 6.5 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గింపు. రివర్స్ రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గింపు. బ్యాంకు రేటు 6.5 శాతం.
► ఆర్‌బీఐ నుంచి బ్యాంకులు తీసుకునే రుణాలపై వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా పేర్కొంటారు. ఆర్‌బీఐ వద్ద బ్యాంకులు ఉంచే నిధులపై పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటుగా వ్యవహరిస్తారు.
► నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్)లో ఎలాంటి మార్పుల్లేవు. 4 శాతంగానే కొనసాగుతుంది.
► వడ్డీ రేట్ల తగ్గింపునకు శక్తికాంతదాస్ సహా నలుగురు ఎంపీసీ సభ్యులు అనుకూలంగా ఓటు. చేతన్‌ఘటే, విరాళ్ ఆచార్య యథాతథానికి ఓటు.
► రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలు 2019 జనవరి–మార్చి త్రైమాసికానికి 2.8 శాతానికి తగ్గింపు. 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలకు(ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి) 3.2–3.4 శాతంగా అంచనా. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికానికి అంచనా 3.9 శాతం.
► జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7.4 శాతంగా ఉండొచ్చు. 2019–20లో ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య 7.2–7.4 శాతంగాను, అక్టోబర్–డిసెంబర్ కాలానికి 7.5 శాతంగానూ ఉండొచ్చు.
► చమురు ధరల్లో అస్పష్టత ఉండొచ్చు. వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధి అవకాశాలపై ప్రభావం చూపిస్తాయి.
► వ్యవసాయ రుణాలు, ప్రాంతీయ అసమానత, కవరేజీ విస్తృతికి ఓ అంతర్గత కమిటీ ఏర్పాటు.
► రూపాయి విలువలో స్థిరత్వానికి ఆఫ్‌షోర్ రూపీ మార్కెట్ల కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు.
► కార్పొరేట్ డెట్ మార్కెట్లో పెట్టుబడుల విషయంలో ఎఫ్‌పీఐలపై ఉన్న నియంత్రణలు ఎత్తివేత.
► పేమెంట్ గేట్‌వే సర్వీసు ప్రొవైడర్లు, పేమెంట్ అగ్రిగేటర్లకు సంబంధించి త్వరలో చర్చా పత్రం విడుదల.
► కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఖర్చు చేసే ఆదాయాన్ని పెంచడం ద్వారా డిమాండ్‌కు ఊతమిస్తాయి.
► ఎన్‌బీఎఫ్‌సీల సమన్వయానికి త్వరలో మార్గదర్శకాలు.
► ఆర్‌బీఐ తదుపరి ఎంపీసీ భేటీ వచ్చే ఏప్రిల్ 2న జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment