సైబర్ భద్రతపై దృష్టి పెట్టండి
ప్రీపెయిడ్ సాధనాలపై బ్యాంకులు, కంపెనీలకు ఆర్‌బీఐ సూచన
ముంబై: ఇటీవలి పరిణామాలతో డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో సైబర్ మోసాలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రీపెయిడ్ పేమెంట్ సాధనాలను (పీపీఐ) జారీ చేస్తున్న బ్యాంకులు, కంపెనీలను రిజర్వ్ బ్యాంక్ సూచించింది. భద్రతపరమైన వ్యవస్థ పటిష్టతపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రత్యామ్నాయ చెల్లింపుల సాధనాలు.. ముఖ్యంగా ఈ-వాలెట్ల వాడకం పెరిగిం దని ఆర్‌బీఐ పేర్కొంది.
కొత్త ఖాతాదారులు, వ్యాపారస్తులను సమకూర్చుకునే ప్రయత్నాల్లో సైబర్ భద్రతకు సంబంధించి ఏ చిన్న ప్రతికూల ఉదంతం చోటు చేసుకున్నా.. మొత్తం డిజిటల్ సాధనాలపై ప్రజలకు విముఖత ఏర్పడే అవకాశం ఉందన్న సంగతి గుర్తెరగాలని ఆయా బ్యాంకులు, సంస్థలకు ఆర్‌బీఐ సూచించింది. ఈ నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్‌స టీమ్(సెర్ట్-ఇన్)కి చెందిన ఆడిటర్లతో సైబర్ భద్రత చర్యలపై ఆడిట్ జరిపించుకుని, దిద్దుబాటు చర్యలేమైనా ఉంటే తక్షణం అమలు చేయాలని పేర్కొంది.