
న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో ఇళ్లకు ప్రోత్సాహమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్... ఇంటి కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. గృహాల కొనుగోలుదారులకు మరిన్ని అధికారాలు దఖలు పడేలా దివాలా చట్టాన్ని (ఐబీసీ) సవరిస్తూ చేసిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. దీనితో ఇకపై ఇంటి కొనుగోలుదారులకు కూడా ఆర్థిక రుణదాతల హోదా లభిస్తుంది. ఫలితంగా ఆయా సంస్థలు ఒకవేళ దివాలా తీస్తే... కీలక నిర్ణయాలు తీసుకునే రుణదాతల కమిటీలో (సీవోసీ) కొనుగోలుదారులకూ ప్రాతినిధ్యం లభిస్తుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. మోసపూరిత డెవలపర్లపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఐబీసీలోని సెక్షన్ 7 కింద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం దరఖాస్తు చేసే అధికారం కూడా గృహ కొనుగోలుదారులకు లభిస్తుంది. పలు హౌసింగ్ ప్రాజెక్టుల నిర్మాణం నిల్చిపోవడం, నిర్మాణాల్లో జాప్యం వంటివి గృహ కొనుగోలు దారుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఐబీసీ చట్ట సవరణ ఊరటనివ్వనుంది. మరోవైపు, లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్‌ఎంఈ) ప్రమోటర్లకు సైతం ఐబీసీ సవరణతో కొంత వెసులుబాటు లభించనుంది. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు ఎదుర్కొంటున్న తన సొంత సంస్థను దక్కించుకునేందుకు ప్రమోటరు కూడా బిడ్ చేయొచ్చు. అయితే, సదరు ప్రమోటరు ఉద్దేశ పూర్వక ఎగవేతదారుగా ముద్రపడని వారై ఉండాలి. దివాలా చట్ట నిబంధనలను ఉల్లంఘించి, అనర్హతకు గురైన ప్రమోటర్లు మాత్రం బిడ్డింగ్‌లో పాల్గొనడానికి ఉండదు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎంఎస్‌ఎంఈ రంగానికి మరికొన్ని మినహాయింపులిచ్చేందుకు, నిబంధనలను సవరించేందుకు ఈ చట్ట సవరణతో కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి. ఐబీసీలో సవరణలకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్ గతనెలలో ఆమోదించింది. దీనికే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.
చౌక ఇళ్లకు ఆర్‌బీఐ బూస్ట్..
అందుబాటు ధరల్లోని గృహాల కొనుగోళ్లకు మరింత ఊతమిచ్చేలా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ప్రాధాన్యతా రంగ రుణాల (పీఎస్‌ఎల్) విభాగం కింద వీటికిచ్చే రుణాల పరిమితి పెంచింది. మెట్రో నగరాల్లో పీఎస్‌ఎల్ కింద గృహ రుణం పరిమితిని రూ.28 లక్షల నుంచి 35 లక్షలకు, ఇతర ప్రాంతాల్లో రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ రుణం పొందేందుకు మెట్రో నగరాల్లో (10 లక్షల మించి జనాభా ఉన్నవి) ఇంటి విలువ రూ.45 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.30 లక్షలు మించకుండా ఉండాలి. దీనిపై ఈ నెలాఖరులో సర్క్యులర్ జారీ చేయనుంది. ప్రాధాన్యతా రంగం కింద గృహ రుణాల పరిమితిని పెంచడంతో సదరు లోన్‌లు మరింత చౌకగా లభిస్తాయని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్.. మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్‌లో తెలిపారు. బ్యాంకులు సాధారణంగా ఇచ్చే రుణాలతో పోలిస్తే పీఎస్‌ఎల్ కింద ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు కొంత తక్కువగా ఉంటాయి. మరోవైపు, ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) దగ్గరున్న మిగులు స్థలాలను.. చౌక గృహాల నిర్మాణానికి ఉపయోగించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం కూడా అందుబాటు ధరల్లో ఇళ్ల కొనుగోలుకు ఊతమివ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment